Vankudotu Sarita Meets Minister komatireddy : నల్గొండ జిల్లాలో ఎక్కడో మారుమూల గుట్టల మధ్యనున్న ఓ చిన్న తండాలో జన్మించిన గిరిజన బాలిక వాంకుడోతు సరిత, దేశంలోనే తొలి మహిళా బస్సు డ్రైవరుగా గుర్తింపు సాధించింది. హస్తిన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ చేతుల మీదుగా దిల్లీ బస్సు డ్రైవర్‌గా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది. అప్పటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి సైతం ప్రశంసలందుకుంది. తల్లిదండ్రులను సాకేందుకు దిల్లీలో ఉద్యోగాన్ని వదిలిన ఆమె ప్రస్తుతం ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటోంది. స్థానికంగా ఉద్యోగం కావాలని మంత్రిని వేడుకుంటోంది.
చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు : సరిత నలుగురు అక్కలు ఉన్నారు. వారందరికి వివాహాలై అత్తవారిళ్లకు వెళ్లడంతో, కుటుంబాన్ని పోషించేందుకు ఏడో తరగతితో చదువు ఆపి దేవరకొండకు వెళ్లి మగ పిల్లాడిగా జుట్టు కత్తిరించుకుంది. మొదటగా ఆటో నడపడం నేర్చుకొని నడిపింది. ఓపెన్ స్కూలులో పదో తరగతి పూర్తి చేసి హెవీ వెహికిల్ డ్రైవర్ లైసెన్సు పొందింది. సొంతంగా ఆటో లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు స్కూలు బస్సు డ్రైవరుగా పని చేసింది.
దిల్లీలో బస్సు డ్రైవర్ : హైదరాబాద్‌లో ఒక మహిళా అధికారి సాయంతో దిల్లీకి వెళ్లి కారు డ్రైవరుగా పని చేసింది. కొన్ని రోజుల తర్వాత దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో 2015లో బస్సు డ్రైవరుగా ఉద్యోగానికి దరఖాస్తు చేసి, సీఎం కేజ్రీవాల్ చేతులమీదుగా నియామకపత్రం అందుకుంది. ఆమె తల్లిదండ్రులు రామ్‌కోటి (80), రుక్క (75)లు సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో నివసిస్తున్నారు.
మంత్రికి వినతి : తండ్రి వయోవృద్ధుడు కాగా, తల్లికి ఇటీవల కాలు విరుగింది దీంతో వారికి ఆసరాగా ఉండేందుకు దిల్లీలో ఉద్యోగం వదిలి తండాకు వచ్చేందుకు సిద్ధమైంది. తమకు జీవనాధారం లేదని, స్థానికంగా ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఆదివారం నల్గొండలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి వేడుకుంది. స్పందించిన ఆయన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్డీసీ ఎండీ సజ్జనార్‌కు ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
సినీఫక్కీలో బస్సులో చోరీ - పోలీసులు ఈ కేసు ఎలా ఛేదించారంటే? - JADCHERLA BUS THEFT CASE SOLVED
శామీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్ - Turkapalli Road accident video