Vangalapudi Anitha Take Charge As Home Minister: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్ 2లో పూజా కార్యక్రమం అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కుమార్తె రష్మితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనితకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు, చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని అనిత అన్నారు. సామాన్య టీచర్‌ను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నాపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని అనిత పేర్కొన్నారు. దిశా పోలీసు స్టేషన్ల పేరు మారుస్తామని హోంమంత్రి తెలిపారు. పోలీసుల్లో పాత ప్రభుత్వ ఆలోచనల్లో ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని ముందుగా సూచించారు.
పోలీసులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని, సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని హోంమంత్రి వెల్లడించారు.
రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ : రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో పయ్యావుల బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరగబోయే అసెంబ్లీ నిర్వహణపై మంత్రి తొలి సంతకం చేసి అధికారులతో సమీక్షించారు. తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పయ్యావుల నివాళులర్పించారు. శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి సమర్థవంతమైన చర్చలు జరగాలని పయ్యావుల ఆకాంక్షించారు. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా తామేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించేందుకు కృషి చేస్తానని పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా తాము సిద్దంగా ఉంటామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత - Home Minister Anitha Take Charges