Vamsadhara River Karakatta Works Stopped: శ్రీకాకుళం జిల్లా ప్రవహిస్తున్న వంశధార నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు గ్రామాల పరిస్థితి ఏళ్ల తరబడి అలానే కొనసాగుతోంది. వంశధార నది ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలైన 11 మండలాల్లో 119 గ్రామాల్లో వరదల దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఏటా జులై నుంచి నవంబర్ మధ్య భారీ వర్షాలు రావడంతో వంశధార నదీ ప్రవాహం పెరిగి పరిసర గ్రామాలపై విరుచుకుపడుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ పంట నష్టం జరుగుతున్నాయి. జిల్లాలో వరద ప్రభావిత మండలాలు కొత్తూరు, హిరమండలం, భామిని, ఎల్ఎన్ పేట, సరుబుజ్జిలి, ఆముదాలవలస, శ్రీకాకుళం గ్రామీణం, గార, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, ప్రాంతాల్లో ప్రతి ఏడాది వరద ముంపు తప్పడం లేదు.
2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 177 కోట్ల అంచనా వ్యయంతో వరద దాటిని తట్టుకోవడానికి కరకట్టల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. తెలుగుదేశం హయాంలో కరకట్టల నిర్మాణానికి 650 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం అయ్యాయి. 20 శాతానికి పైగా పనులు సైతం పూర్తయ్యాయి.
Rivers Linking: మాటిచ్చి మడమ తిప్పారు.. నిలిచిన వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియ
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణ పనులన్నీ నిలిపివేసింది. ఈ ఒక్క నిర్ణయంతో 119 గ్రామాల్లోని వేల మంది ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఆ తర్వాత నుంచి అధికారులు జిల్లా ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కరకట్టల నిర్మాణ పనుల జోలికి పోలేదు. కరకట్టల నిర్మాణాలు పూర్తిచేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ముంపు గ్రామాల ప్రజలు వాపోయారు.
వరదలు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులు ఆ గ్రామాలకు వెళ్లటం, కరకట్టలు నిర్మిస్తామని హామీలు ఇవ్వటం తప్ప పరిష్కారం చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు. అయితే కరకట్టల పనుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా గతంలో అధికారులు పనులు చేయించారు. వాటిలో రెండు పూర్తిగా రద్దయ్యాయి. మరో రెండు పెండింగ్లో ఉన్నాయి. వంశధార నదిపై మొత్తం కరకట్టలు నిర్మించాలంటే భారీ వ్యయమే ఖర్చవుతుంది. అత్యవసరంగా అవసరం అయిన చోట్ల కరకట్టలు నిర్మించాలంటే దాదాపు 115 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లకు పైగానే అవుతున్నా కనీసం ఒక్క శాతం పని కూడా చేయకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. వర్షాకాలానికి ముందే అవసరమైన చోట కరకట్టలు నిర్మించి గ్రామాలు ముంపునకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Vamsadhara: సిక్కోలు జీవధార ఓ గ్రామానికి కన్నీటి ధార.. కొద్దికొద్దిగా తన గర్భంలో కలిపేసుకుంటూ గుండెకోత