Quick US Visa Appointments TO Indian Students : భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాల కోసం ఇంటర్య్వూలకు వేచి ఉండే సమయం పది రోజులకు మించకూడదని అమెరికా కాన్సులేట్‌లో దాని చీఫ్ రెబెకా డ్రామె పేర్కొన్నారు. విద్యార్థులకు వీసాలపై ఎలాంటి పరిమితీ లేదని, ఎంతమంది వచ్చినా అమెరికాకు అందరినీ స్వాగతిస్తామని ఆమె తెలిపారు. కాన్సులేట్ బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారిక పర్యటన చేస్తున్న సందర్భంలో ఆమె ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అలాంటి వార్తలు విన్నప్పుడు మనసుకు బాధగా ఉంటుంది: చదువు కోసం మొదటిసారి అమెరికా వస్తున్న విద్యార్థులు వీసాలు క్లియర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెబెకా డ్రామె తెలిపారు. అమెరికా వచ్చే విద్యార్థుల భద్రతకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని వివరించారు. తానొక తల్లినని విద్యార్థులు వివిధ ప్రమాదాల్లో చనిపోయినప్పుడు సమయంలో తన మససు చలించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు వీసాలు ఇచ్చేది అమెరికాలో చదువుకోడానికే. అలా చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగంలో అనుభవం సంపాదించి చదువు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగి వెళ్లి మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న లక్ష్యంతో ఓపీటీ పెట్టినట్లు ఆమె వివరించారు.
రోజుకు 1,800 పైగా ఇంటర్వ్యూలు : బీ1/బీ2 వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ సమయం 2021-22 నాటికి నాలుగు సంవత్సరాలు ఉండేదని తమ కాన్సులేట్ బృందాల ప్రత్యేక కృషితో దాన్ని సంవత్సరానికి కుదించినట్లు తెలిపారు. మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు
ఆమె చెప్పుకొచ్చారు. బీ1, బీ2 కాకుండా స్టూడెంట్స్, వర్కర్స్ వీసా దరఖాస్తులను రెండు నెలల్లోనే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి చూస్తే హైదరాబాద్ కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేశామని, వచ్చే ఏడాది ఆఖరికి దానిని మూడు రెట్లు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ తర్వాత కాలంలో రోజుకు 500 నుంచి 600 వీసా ఇంటర్వ్యూలు జరిగితే, ఇప్పుడు రోజుకు 1,800 దాటి చేస్తున్నట్లు వివరించారు.
సిబ్బందికి ముందే అవగాహన కల్పిస్తున్నాం : హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ అనేది ఆగ్నేయాసియాలో అతి పెద్దది. బీ1, బీ2 వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ సమయం ఎక్కువగా ఉంటుందని కారణాలను వివరించారు. అప్పటికీ ఎవరైనా ఇతర దేశాల్లో ఇంటర్వ్యూలకు హాజరవుతుంటే వారిని ఎలాంటి ప్రశ్నలు అడగాలన్న విషయంలో అక్కడి సిబ్బందికి ముందే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌లోని ఇంగ్లీషు, తెలుగు క్షుణ్ణంగా తెలిసిన అనువాదకుల్ని నియమిస్తున్నామని ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడాలనుకునేవారు ట్రాన్స్‌లేటర్స్ కావాలని కోరితే సరిపోతుందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక హెచ్1బీ వీసాల విధానం ఎలా ఉంటుందన్న అంశంపై తానేమీ మాట్లాడాలనుకోవడం లేదని ఆమె తెలిపారు. సహజంగా అధ్యక్షుడు మారాక విధానాల్లో కొన్ని మార్పులు ఉంటాయని వాటిని ఇప్పుడే ఊహించలేమని చెప్పారు.
భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!
ఇక అమెరికా వీసా మరింత భారం- హెచ్1బీ సహా ఐదు కేటగిరీల ఫీజులు పెంపు