Uravakonda Gavi mutt Brahmotsavam 2024: నేటి నుంచి ఉరవకొండలోని గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కంకణ ధారణతో మొదలయ్యే ఉత్సవాలు వసంతోత్సవంతో ముగియనున్నట్లు పేర్కొన్నారు.
ఉత్సవాలు జరిగే తేదీలు ఇలా: మొదటి (14వ తేదీ) రోజు కంకణ దారణ, 15వ తేదీన నాగాభరణ ఉత్సవం, 16వ తేదీన నెమలి వాహనోత్సవం, 17వ తేదీన పీఠాధిపతి అడ్డపల్లకీ ఉత్సవం, ఐరావత వాహనోత్సవం, 18వ తేదీన బసవేశ్వర వాహనోత్సవం, 19వ తేదీన మహా రథోత్సవం, 20వ తేదీన లంకాదహనం, 21వ తదీన వసంతోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయని పేర్కొన్నారు.
గవిమఠం పీఠాధిపతి ఆదేశాలతో ఆలయ సహాయ కమిషనరు చిట్టెమ్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆధ్యాత్మిక శైవ క్షేత్రమే కాకుండా వందల సంవత్సరాలుగా విద్యా, వైద్యం, ఉపాధి తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉరవకొండలోని గవిమఠం పరిధిలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో 770 ఉప మఠాలు ఉన్నాయి.
శ్రీకాళహస్తిలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు- అశ్వ, సింహ వాహనాలపై భక్తులకు దర్శనం
పేరు ఎలా వచ్చిందంటే: మఠంలో సహజంగా వెలిగిన చంద్రమౌళీశ్వరుడు గవి (గుహ)లో పూజలు అందుకుంటుండటంతో ఇది గవి మఠంగా పేరు గాంచింది. ప్రస్తుతం మఠానికి 8వ పీఠాధిపతిగా చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారిగా డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి కొనసాగుతున్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి: ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ సహాయ కమిషనర్ చిట్టెమ్మ అన్నారు. భోజన ఏర్పాట్లు, చలువ పందిర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఏడాది వినూత్నంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
19వ తేదీన జరిగే రథోత్సవానికి భారీగా భక్తులు వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో, అధికంగా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రానీయకుండా చూస్తామన్నారు. 20వ తేదీన జరిగే లంకాదహనం కార్యక్రమానికి సైతం ఏర్పాట్లు చేశామని చిట్టెమ్మ వెల్లడించారు.
శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- వృషభ, సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు