Union Minister Murugan on Central Budget for AP : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ కేటాయించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకానమీ 8.2 శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతిని పురస్కరించుకుని కలాం చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
Union Minister Murugan on AP Budget : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో సరళతరం, ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం దిశగా తగిన నిర్ణయాలను బడ్జెట్‌లో తీసుకున్నట్లు మురుగన్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి 2024 - 25 బడ్జెట్‌లో దాదాపు రూ. 50,474 కోట్లు కేటాయించారని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, తమకు చాలా కీలకమని, సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖ - చెన్నై, హైదరాబాద్ - బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారని అలాగే ప్రతిష్ఠాత్మక పూర్వోదయ స్కీంను తెచ్చామని, దీనివల్ల జార్ఖండ్ నుంచి ఏపీ వరకూ ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా మారుస్తామన్నారు.
ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనకబడిన ప్రాంతంగా గుర్తించి వీటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయంలో విభిన్న పంటల పెంపకం కోసం పరిశోధనలు చెయ్యడానికి నిధులు కేటాయించారని అన్నారు. దేశంలో రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ది 60 శాతంగా ఉందని అన్నారు. రొయ్యల రైతుల కోసం రొయ్యల బ్రీడింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తామని మురుగన్ తెలిపారు.
"2024 - 25 కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వృద్ధికి, ఏపీ అభివృద్ధికి దోహదం చేసేలా ఉంది. రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం అందించేలా ఉంది. వెనకబడిన ప్రాంతాలకు చేయూతనిచ్చేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం సంసిద్ధత తెలిపింది. దీని ద్వారా రాష్ట్ర విభజనతో కోల్పోయిన కళను ఏపీ మళ్లీ సాధిస్తుంది. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్య స్థానంగా మారనుంది."- మురుగన్, కేంద్ర మంత్రి
రాజధానికి రూ. 15 వేల కోట్లు అప్పా? లేక గ్రాంటా? - నిర్మలా సీతారామన్ స్పష్టత - Budget 2024 for AP