Kishan Reddy Visits Flood Affected Areas in Khammam : ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పర్యటించారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసాలపురం, పాలేరు నియోజకవర్గం తిరుమాలాయపాలెం, రాకాసి తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకున్న కిషన్‌రెడ్డి బియ్యం, నిత్యవసర వస్తువులతో పాటు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు.
వరద బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సిన అవరసం ప్రభుత్వంపైనా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విపత్తు నిధులను వినియోగించుకోని బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు తాత్కాలిక నివాసాలు కల్పించాలని కోరారు. ప్రకృతి సృష్టించిన వైఫరీత్యం అందరం కలిసి కట్టుగా ఎదుర్కొవాలన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర బృందాలు వచ్చి సర్వే చేస్తాయని తర్వాత కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.
"వర్ష ప్రభావిత ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. వారిని పూర్తి స్థాయిలో అందరం ఆదుకోవాలి. సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. స్టేట్ డిజాస్టర్‌కు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కావాల్సినన్ని నిధులు కేంద్రం సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాధికారులు నష్ట సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో తీసుకోవడం అయ్యాక ప్రజలకు కావాల్సినవి చేస్తారు." - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, సాయం రాష్ట్ర సర్కార్ ఎప్పుడు ఆశిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సహాయం చేయకపోవడమే కాకుండా వరదతో బురద రాజకీయాలు చేస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
"కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, కానీ ఇలాంటి విపత్తు జరిగినప్పుడు మాత్రం వాటికి అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర సహాయం ఆశిస్తుంది. దానికి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ రాష్ట్రానికి వారు సహాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పటికి వారు సహాయం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు. కృతజ్ఞతలు తెలుపుతున్నాను." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి