Union Minister Kishan Reddy Comments On Flood Relief : విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విలయం సృష్టించిన వర్షాల ధాటికి నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయని తెలిపారు. ప్రధానంగా పదకొండు జిల్లాల్లో వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని కేంద్రమంత్రి విచారం వ్యక్తంచేశారు.
వర్షాలు, వరదల వల్ల ఆస్తులు కోల్పోవడం, పంట నష్టం భారీగా వాటిల్లిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే వరద ప్రభావంపై ప్రధాని మోదీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్ష చేస్తుందన్న ఆయన, ఇప్పటికే దెబ్బతిన్న జాతీయ రహదారులను మరమ్మత్తు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించిందని తెలిపారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో రూ.1,345 కోట్లు ఉన్నాయి : ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎవ్వరిపైన విమర్శలు చేయకుండా అందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముంపు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు పర్యటించి ఆహారం, తాగునీరు అందిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ రూ.1345 కోట్లు ఉందని, ప్రెజెంట్ ఆ ఫండ్‌ను ఉపయోగించి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. అది అయిపోతే, తాత్కాలికంగా కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తామన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇరూ.1345 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉంది. నిధుల కొరత లేదు. వెంటనే తాత్కాలికంగా అన్నిరకాల అవసరాలకు ఆ డబ్బులను ఉపయోగించి బాధితులను ఆదుకునే కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అది పూర్తిస్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్, అంతవరకూ స్టేట్ నిరభ్యంతరంగా ఖర్చు చేసుకోవచ్చు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయి. అదనపు ఫండ్ ఇస్తుంది."-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇస్తుందన్న ఆయన, రాష్ట్ర సర్కార్ రూ.5 లక్షలు ప్రకటించటం పట్ల సందేహం వెలిబుచ్చారు. కేంద్రం ఇచ్చే ఫండ్‌ను కలుపుకుని ముఖ్యమంత్రి రూ.5 లక్షలు ప్రకటించారేమో మరి తెలియదని వ్యాఖ్యానించారు. అంటువ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ప్రధాన మంత్రి పర్యటిస్తారని, జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదన్నారు. నిధులు ఇచ్చి సహాయ, సహకారాలు అందిస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
Kishan Reddy On Liberation Day Celebrations : హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జరిగేలా కేంద్రం నిర్ణయిం తీసుకుందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు వివరించారు. మజ్లిస్‌కు భయపడి గత ప్రభుత్వాలు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోయాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న ప్రతి గ్రామ పంచాయతీపైన జాతీయ జెండా ఎగురవేస్తామని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
లెక్కలే తీయకుండా సాయం అడిగితే ఎలా? : మరోవైపు ప్రెస్‌మీట్ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద సాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అధికారులు వరద ముంపు గ్రామాల్లోకి వెళ్లి లెక్కలే తీయనప్పుడు ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5వేల కోట్ల సాయం అడుగుతున్నారని ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు భూముల ద్వారా ప్రభుత్వాన్ని నడపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదును 7వ తేదీన మధ్యాహ్నం ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జాతీయ నాయకత్వం చేతిలో ఉంటుందని, ఎప్పుడూ ప్రకటిస్తుంది, ఎవ్వరినీ ప్రకటిస్తుందనేది తెలియదన్నారు.