Amaravati Link Railway Project : ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,245 కోట్లతో రాజధాని అమరావతికి నూతన రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 57 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపడతామన్నారు.
ఈ రైల్వే లైన్ కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఏర్పాటు కానుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులభం కానుంది. అమరావతి స్థూపం, ధ్యాన బుద్ధ ప్రాజెక్టు, ఉండవల్లి గుహలు, అమర లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేవారికి అనువైన మార్గంగా మారనుంది.
6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు : రైల్వే లైన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లను కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులిచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 'ఎక్స్' వేదికగా వివరాలు వెల్లడించారు.
చంద్రబాబు, పవన్ కృతజ్ఞతలు : అమరావతి రైల్వే లైన్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. దిల్లీ వేదికగా అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో అమరావతి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. భూ సేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట్ర సహకారం ఉంటుందని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.