Old Man Abandoned in Mangalagiri : గుర్తుతెలియని ఓ వృద్ధుడిని రోడ్డుపక్కన వదిలివెళ్లారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయణ్ని అటుగా వెళ్లేవారు ఎవరూ పట్టించుకోలేదు. చీకట్లో చలికి శరీరం బిగుసుకుపోయి సహకరించలేదు. దీంతో తెల్లవార్లూ మంచులోనే గడిపారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళగిరి నుంచి పెదవడ్లపూడి వెళ్లే మార్గంలో మంగళగిరి సమీపంలో శనివారం అర్ధరాత్రి వేళ ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి విడిచిపెట్టారు.
నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ను అటుగా వెళ్లేవారు ఎవరూ పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం మంగళగిరికి చెందిన ప్రకాష్ అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పెదవడ్లపూడిలో ప్రార్థనలకు వెళ్తున్నారు. రోడ్డు పక్కన దీనస్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి చలించిపోయారు. అతని వద్దకు వెళ్లి తాగునీటిని అందించారు. ఎందుకు ఇక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. సరిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆ వృద్ధుడిని చూసి వారు పోలీసులకు సమాచారం అందించారు.
108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆ వృద్ధుడి పరిస్థితిని వివరించారు. తనను ఎవరో ఆటోలో తీసుకొచ్చి వదిలివెళ్లారని బాధితుడు తెలిపారు. తాను విజయవాడ వన్‌టౌన్‌లోని మల్లికార్జునపేటకు చెందిన వ్యక్తిగా ఆయన తెలియజేశారు. గ్రామీణ పోలీసులు సదరు వృద్ధుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న కుటుంబాన్ని పలువురు అభినందించారు.