Unemployed Concern of Release Mega DSC Notification: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ దగా నోటిఫికేషన్ అవుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు చరిత్రలో ఒక చీకటి రోజు అవుతుందని యూటీఎఫ్ నేతలు మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి అప్రెంటిస్ విధానం రద్దు చేయిస్తే మళ్లీ వైసీపీ ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాన్ని రద్దు చేసి 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ తీరుకు నిరసనగా నోటిఫికేషన్ ప్రతులను చాలా చోట్ల దగ్ధం చేసి ఆందోళన చేశారు.
మెగా డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగుల ర్యాలీ - ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Srikakulam: శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతులను యూటీఎఫ్ నేతలు దగ్ధం చేశారు. బానిస వ్యవస్థ అయిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే ఉపసంహరించుకోకపోతే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పార్వతీపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అప్రెంటిస్ విధానం రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
"స్పెషల్ డీఎస్సీ ద్వారా ప్రత్యేక ఉద్యోగాలు లేనప్పుడు - టెట్ 1బీ, 2బీ ఎందుకు నిర్వహించారు"
Guntur: వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ విడుదల చేసిన రోజున ఉపాధ్యాయుల చరిత్రలో చీకటి రోజుగా యూటీఎఫ్ నాయకులు అభివర్ణించారు. దాదాపు 25వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని అనుకుంటే కేవలం 6వేల100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డీఎస్సీ నోటిఫికేషన్ ఉత్తర్వులను తగలబెట్టారు. రెండు సంవత్సరాల అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Kurnool collectorate: కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ప్రతులను దగ్ధం చేశారు. గతంలో ఉన్న అప్రెంటిస్ విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాడి రద్దు చేయించాయని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం మరోసారి ఈ విధానాన్ని తీసుకురావటాన్ని ఖండిస్తున్నామని ఇప్పటికైనా దానిని రద్దు చేయాలని కోరారు.
దగా డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీ కావాలి - సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన ఏఐవైఎఫ్ కార్యకర్తల అరెస్టు
ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులను మోసం చేశారంటూ ఎన్‍ఎస్‍యూఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ యువత తిరుపతిలో నిరసన చేపట్టారు. దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా బాలాజీ కాలనీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీ పోస్టులు పెంచమంటే చేతకాని ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించడం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ నాయకులు విమర్శించారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఆ పోస్టులను భర్తీ చెయ్యలేదని మండిపడ్డారు.
దగా డీఎస్సీ వద్దంటూ ఎన్‍ఎస్‍యూఐ ఆందోళన - మంత్రి ఇంటి ముట్టడికి యత్నం