Two Trains on Tracks at a Time in Visakha Railway Station : రైళ్లలో ప్రయాణమంటేనే టెన్షన్ వాతావరణం ఉంటుంది. ప్రయాణానికి ముందు బయల్దేరినా సమయానికి చేరుకుంటామో లేదోనని ఆందోళన ప్రయాణికుల్లో ఉంటుంది. తీరా స్టేషన్‌కు చేరుకున్న తర్వాత తాము ఎక్కాల్సిన ట్రైన్ ఏ ప్లాట్‌ఫామ్ ఆగిందో తెలుసుకోవాలి. ఓ వైపు టైమ్ అయిపోతుంటుంది. మరోవైపు రైలు ఎక్కడ ఉందో తెలుసుకుని ఎక్కాలి. లేకపోతే ట్రైన్ మిస్ కావాల్సిందే.
ఓ వైపు ప్రయాణికులు ఇంత టెన్షన్ పడుతుండగా తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న అధికారుల వింత చర్యలతో ఆ తిప్పలు మరింత పెరుగుతున్నాయి. విశాఖలోని రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌ల కొరత నెపంతో అక్కడి నుంచి రెండు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఒకే సమయంలో ఒకదాని వెనక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ముందుగా వెళ్లాల్సిన విశాఖ - భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఏడో నంబర్ ప్లాట్ ఫామ్‌కు ముందు వైపు ఉంచారు. అదే సమయంలో విశాఖ నుంచి దుర్గ్ వెళ్లాల్సిన రైలు బోగీలను దాని వెనుకనే నిలుపుతున్నారు.
రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ప్రకటనలో తెలియజేస్తున్నా వంతెన దిగిన వెంటనే కనిపిస్తున్న రైలు బోగీల్లోకి ప్రయాణికులు వెళ్లిపోతున్నారు. కొద్ది సేపటి తర్వాత తాము ప్రయాణించాల్సిన రైలు ఇది కాదని తెలుసుకుని పరుగులు తీయడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు తప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు విశాఖ-భువనేశ్వర్, అటు విశాఖ-దుర్గ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండటంతో పలువురు తికమక చెందాల్సిన దుస్థితి నెలకొంటోంది. నిత్యం ఇదే తంతు ఉన్నా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటేసి హైదరాబాద్ బాట పట్టిన జనం -కిక్కిరిసిన మెట్రో, బస్సులు - Voters Returned To Hyderabad