Murder under the influence of alcohol : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ చింతలూరు గ్రామ సమీపంలోని టేకుతోటలో గత నెల 27న గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయ్యింది. ఈ కేసును చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి సీఐ రమేష్ వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరానికి చెందిన దొడ్డి రాజా అర్జున్ (50) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిస కావడంతో 20 ఏళ్ల క్రితం భార్య, పిల్లలు అతడిని వదిలేసి హైదరాబాద్ వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దీంతో రాజమహేంద్రవరంలోని సోదరి వద్ద ఉంటున్న రాజా అర్జున్ తన స్నేహితులైన వెంకటేష్, పుష్పరాజ్‌తో కలసి నిత్యం మద్యం సేవించేవాడు.
ఈ క్రమంలో రాజా అర్జున్ సహా మరో ఇద్దరు స్నేహితులు వడ్రంగి పని నిమిత్తం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఇంటీరియర్ డెకరేషన్ షాపు యజమాని వద్ద విజిటింగ్ కార్డులు తీసుకుని బయల్దేరారు. గత నెల 27న చింతపల్లి మండలం లోతుగెడ్డ కూడలికి వీరు ముగ్గురూ చేరుకుని మద్యం సేవించారు. ఈ క్రమంలో మత్తులో ముగ్గురి మధ్య ఘర్షణ నెలకొని రాజా అర్జున్‌ను హత మార్చాలని పుష్పరాజ్, వెంకటేశ్ భావించారు.
లోతుగెడ్డ కూడలిలో నాటు సారా కొనుగోలు చేసి సమీపంలోని టేకు తోటల్లోకి వెళ్లి రాజా అర్జున్‌తో అత్యధికంగా సారా తాగించారు. మద్యం మత్తులో ఉన్న అతడి తలపై రాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం వెంకటేష్, పుష్పరాజ్ తమేకేమీ తెలియనట్టు వెళ్లిపోయారు. హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు ఊహించని ఆధారం లభించింది. పోలీసులు సంఘటనా స్థలం దొరికిన విజిటింగ్ కార్డు ఆధారంగా రాజమహేంద్రవరం వెళ్లి విచారించారు. దీంతో రాజమహేంద్రవరానికి చెందిన ఇంటీరియర్ డెకరేషన్ షాపు యజమాని తమ వద్దకు వచ్చిన ముగ్గురి వివరాలు వెల్లడించగా అసలు విషయం బయటపడింది. స్నేహితులే చంపేశారని గుర్తించి, డౌనూరు వద్ద మద్యం తాగుతుండగా వారిద్దరినీ చాకచాక్యంగా పట్టుకున్నామని సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని వెల్లడించారు.
భార్య పుట్టింటికి వెళ్లిందని హత్య చేసిన భర్త
'ఆమెను చంపి 59 ముక్కలు చేశా!'- ప్రధాన నిందితుడి సూసైడ్ నోట్ - Bengaluru Murder Case