Two Constables Suspended During Allu Arjun Nandyala Visit: నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి (MLA Shilpa Ravichandra Kishore Reddy) మద్దతుగా నంద్యాలలో కథానాయకుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీతోపాటు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేసి మరీ ఆదేశాలు జారీ చేస్తే తప్పంతా కానిస్టేబుళ్లదే అయినట్లు వారిపై వేటు వేశారు. నాటి ఘటనలకు నంద్యాల రెండో పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలుకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజును వీఆర్‌కు పంపడం పోలీసుల్లో చర్చనీయాంశమైంది.
ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్నే రేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. నంద్యాల ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, డీఎస్పీ ఎన్. రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని కూడా సూచించింది.
Case on Allu Arjun in Nandyala: ఎలాంటి అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లడంపై కేసు నమోదైంది. సెక్షన్ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అల్లు అర్జున్ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASE