Two Arrested for Cooking Skunk Curry and Uploading it on YouTube : ఇటీవల కాలంలో చాలా మందికి సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారింది. కొందరు ఫేమస్ అవ్వడం కోసం, లైక్‌లు, షేర్ల కోసం ప్రమాదకరమైన వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో జీవితాలను కోల్పోయినవారెందరో అయితే, ఇరకాటంలో పడేవారూ లేకపోలేదు. ఇటువంటి ఘటనే మన్యం జిల్లాలో జరిగింది. యూట్యూబ్‌ల్లో లైక్‌లకోసం చేసిన పని ఇద్దరిని జైలు పాలుచేసింది. ఇంతకీ వారేం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అసలేంజరిగిందంటే.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని బండిదొరవలస గ్రామానికి చెందిన సీమల నాగేశ్వరరావు సచివాలయంలో జూనియర్ లైన్‌మన్‌గా పని చేస్తున్నారు. ఈయన తరచూ వీడియోలు చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. గత నెల అదే గ్రామానికి చెందిన ఎ.నానిబాబుతో కలిసి స్థానికంగా ఉన్న అడవిలో ఉడుమును పట్టుకున్నారు. దానిని కూర వండుతూ వీడియో చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టారు.
దీనిపై స్టేట్ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీరిద్దరిపై పార్వతీపురం రేంజ్ అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఉడుమును చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం నేరమని సబ్ డీఎఫ్‌ఓ సంజయ్, రేంజ్ అధికారి రామ్‌నరేష్ మంగళవారం తెలిపారు. యూట్యూబ్‌లో లైక్‌ల కోసం ఉడుము కూర వండిన ప్రభుత్వ ఉద్యోగి సీమల నాగేశ్వరరావుతో పాటు ఎ.నానిబాబును పోలీసులు అరెస్టు చేశారు.
"బరి తెగించారు" ఆన్లైన్లో అటవీ జంతువులు అమ్మకం - ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులో బేరాలు