Tungabhadra Reservoir Gates in Danger: తుంగభద్ర జలాశయం కరవు ప్రాంత జిల్లాలకు గుండెకాయలాంటిది. తాగు, సాగు నీరందించే టీబీ డ్యాం నిర్వహణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా నిధులు విడుదల చేయకపోవడంతో డ్యాం నిర్వహణ ఇబ్బందుల్లోకి వెళ్లింది. దీని పర్యవసానంగా ఆగస్టు 10న కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదతో 19వ నెంబర్ గేటు ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్యాం నిర్మాణం చేసిన తరువాత కేవలం 45 సంవత్సరాలు మాత్రమే పనిచేయాల్సిన జలాశయం గేట్లు 60 ఏళ్లపాటు సేవలందించాయి.
గేట్ల సామర్థ్యంపై డ్యాం నిపుణులు కన్నయ్య నాయుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నివేదిక ఇచ్చారు. గేట్లు శిధిలావస్థకు చేరాయని, తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని నివేదికలో చెప్పారు. ఈ సిఫార్సులను టీబీ బోర్డు అధికారులు, గత ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు. జలాశయానికి ఉన్న 33 గేట్లు మార్చడానికి 120 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని టీబీ బోర్డు అధికారులు కర్ణాటకతోపాటు, తెలుగు రాష్ట్రాలకు నిధుల కోసం నివేదించారు. కర్ణాటక రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వడానికి ఆమోదం తెలిపినప్పటికీ తెలుగు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారుల వద్ద దస్త్రం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
టీబీ డ్యాం నుంచి తాగు, సాగు నీరు పొందుతున్న రాష్ట్రాలు నిధులు విడుదల చేస్తే వచ్చే మార్చినాటికైనా పాత గేట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులు ప్రణాళిక చేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న గేట్ల డిజైన్‌ను కన్నయ్య నాయుడు సిద్ధం చేశారు. దీనికి తుది మెరుగులు దిద్ది వచ్చేవారం టీబీ బోర్డు అధికారులకు ఇవ్వనున్నట్లు సమాచారం. గేటు విరిగిపోయాక టీబీ బోర్డు అధికారులు నీటి వృథాను ఆపటానికి స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఆగస్టు 10న టీబీ డ్యాం 19 నెంబర్ గేటు నదిలో కొట్టుకపోవడంతో వృథా నీటిని అరికట్టడానికి జలాశయాల నిపుణులు కన్నయ్య నాయుడిని అప్పటికప్పుడు పిలిపించారు. ప్రవాహం ఉండగానే స్టాప్ లాగ్ గేట్‌ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లు హెచ్చరించారు. అయితే కన్నయ్య నాయుడు అందరి ఆందోళనకు చెక్ పెడుతూ స్టాప్ లాగ్ గేటు తయారీకి రెండు రోజుల్లో డిజైన్ చేశారు. ఈ గేటు కోసం ఆయా సంస్థలకు 2.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
డ్యాం గేట్ల పరిస్థితిపై ఆందోళన: నైపుణ్య సేవలు అందించినందుకు కన్నయ్యకు 2.5 లక్షలు చెల్లిస్తామని టీబీ బోర్డు అధికారులు హామీ ఇచ్చారు. అయితే గేటు ఏర్పాటు చేసి 2 నెలలు దాటినా ఆయా సంస్థలకు, కన్నయ్య నాయుడుకు టీబీ బోర్డు అధికారులు చెల్లింపులు చేయలేదు. దీనిపై గేటు తయారు చేసిన కంపెనీలు బిల్లుల చెల్లింపుపై కన్నయ్యపై వత్తిడి చేస్తుండగా, తుంగభద్ర డ్యాం అధికారులు మాత్రం మిన్నుకుండి పోయారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం మళ్లీ తుపానుల కాలం కావడంతో కర్ణాటకలో భారీ వర్షాలు నమోదవుతూ, టీబీ డ్యాంకు వరద ముంచెత్తుతోంది. భారీగా వస్తున్న వరదతో డ్యాం గేట్ల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా బోర్డుతో పాటు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
వైన్‌షాపు దగ్గర దొరికే చికెన్ పకోడీ ఇదే! - గుట్టు తెలిస్తే మత్తు దిగాల్సిందే!
"ఆ ఆరు పాలసీలే గేమ్ ఛేంజర్" - మద్యంలో వేలు పెడతామంటే కుదరదు : చంద్రబాబు వార్నింగ్