Prank Video in Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆకతాయిలు హల్చల్ సృష్టించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే నారాయణగిరి ఉద్యానవన షెడ్లల్లో కొందరు ఆకతాయిలు తీసిన ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి దర్శనానికి వెళ్లే సమయంలో నారాయణగిరి షెడ్ల క్యూ లైనులో వెళ్తుంతుండగా అక్కడ షెడ్ల వద్దకు వెళ్లి గేటు తాళాలను తెరవడానికి వెళ్లినట్లుగా నటించారు.
వారిని టీటీడీలో సిబ్బందిగా భావించిన షెడ్లలోని భక్తులు ఆశగా నిలబడ్డారు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆకతాయిలు సామాజిక మాధ్యమైన ఇన్ స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపార్టుమెంట్లలో ప్రాంక్ వీడియోల ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలతో ముడిపడిన దీనిపై టీటీడీ విజిలెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించింది.