Tirumala Time Slot Sarva Darshan Tokens Increase TTD : తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు చేరువ చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు మార్పులు చేపట్టిన టీటీడీ సర్వదర్శన టోకెన్ల సంఖ్యను భారీగా పెంచుతోంది. గడచిన ఐదేళ్లలో బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సర్వదర్శనానికి వచ్చే భక్తులను నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు చేపట్టింది.
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం : తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు సర్వదర్శన టోకెన్లను భారీగా పెంచింది. గత వైఎస్సార్సీపీ పాలనలో వివిధ సాకులతో సర్వదర్శన భక్తులను తగ్గించిన టీటీడీ అధికారులు కూటమి అధికారంలోకి వచ్చాక గత నిర్ణయాలపై సమీక్షించారు. వన్యమృగాల దాడి పేరుతో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను తగ్గించగా రద్దీ దృష్ట్యా సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను గత ఐదేళ్లలో కుదించారు.
తిరుమలపై ప్రత్యేక దృష్టి : కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో టీటీడీ అధికారులు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో తిరుమలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో సామాన్య భక్తులు సంతృప్తికరంగా వైకుంఠనాధుడ్ని దర్శించుకుంటున్నారు.
టీటీడీ ప్రక్షాళన : నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు. అందుకు తగిన రీతిలో టీటీడీ ఈఓ, అదనపు ఈఓలుగా శ్యామలరావు, వెంకయ్య చౌదరిని నియమించి తిరుమలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈఓ, అదనపు ఈఓలు తిరుమలలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను అపరిమితంగా జారీ చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకు వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో సాధారణ భక్తులకు దర్శన సమయం ఎక్కువ అందుబాటులోకి రావడంతో అందుకు తగిన రీతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచారు. గతంలో నెల వరకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను కూటమి ప్రభుత్వం 6 లక్షలకు పెంచింది.
ప్రత్యేక బృందాల ఏర్పాటు : సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతోపాటు భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచడంపై టీటీడీ దృష్టి సారించింది. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్న ప్రసాదాలు తగిన రీతిలో అందచేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అందచేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించడానికి అధికారులను నియమించారు.
తెలంగాణ సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చేలా చంద్రబాబుకు చెప్పాలని రేవంత్‌కు తుమ్మల లేఖ
భక్తులకు తీపి వార్త : తిరుమల స్వామివారి లడ్డూపై కీలక నిర్ణయం! - Tirumala Laddu Taste Increase