New Rules for Tirumala Laddu Prasadam Distribution: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి ఒకటి. నిత్యం ఎంతో మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు కొండపైకి తరలివస్తుంటారు. అలాగే కాలి నడక మార్గం ద్వారా చాలా మంది భక్తులు కొండపైకి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. తిరుమలలో స్వామి దర్శనం తర్వాత చాలా మంది ఎదురుచూసేది లడ్డూల కోసం. ఎందుకంటే వీటి రుచి ఇతర లడ్డూలకు ఉండదు. అందుకే భక్తులు వీలైనన్ని లడ్డూలను కొనుగోలు చేసి బంధువులు, స్నేహితులకు పంచి పెడుతుంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో లడ్డూలకు ఎప్పుడూ భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే, తాజాగా తిరుమల లడ్డూలను భక్తులకు అందించే విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత.. ప్రతి ఒక్కరికీ టీటీడీ ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తుంది. ఆ తర్వాత భక్తులు లడ్డూ కౌంటర్ల దగ్గర 4-6 లడ్డూలను(రూ. 50) కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ, కొంతమంది దళారులు స్వామి వారి దర్శన టికెట్లు లేకుండా లెక్కకు మించి కొని వాటిని బయట అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. దీంతో లడ్డూల బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుందని.. దీనివల్ల సామాన్య భక్తులు మోసపోతున్నారని తెలిపారు.
వారికి మాత్రం ఇక నుంచి రెండు లడ్డూలు: ఇకపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లడ్డూల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక నుంచి దర్శనం టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని.. అదీ కూడా ఆధార్ కార్డు చూపించి మాత్రమే రెండు లడ్డూలు కొనుగేలా చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అంటే స్వామి వారి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు నుంచి 6 లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం ఉంటే.. దర్శనం టికెట్ లేనివారు ఆధార్ కార్డు చూపించి కేవలం రెండు లడ్డూలను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాగా, ఈ నిర్ణయం ద్వారా రెండు రకాలుగా మేలు జరుగుతుందని.. ఒకటి సామాన్య భక్తులకు మరిన్ని లడ్డూలు విక్రయించేందుకు అవకాశం ఉంటుందని.. రెండోది భక్తుల ముసుగులో లడ్డూప్రసాదాలను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించే వారిని అడ్డుకోవచ్చని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
తిరుమల భక్తులకు శుభవార్త- శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి- ఎప్పటి నుంచో తెలుసా?
'తిరుమల లడ్డూలపై అసత్య ప్రచారం నమ్మొద్దు'- ఇకపై వారికి ఆధార్ ఉంటేనే!