TS Eamcet Renamed as EAPCET : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరును మారుస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ స్థానంలో టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీగా మారుస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అందులోనే పేరు మార్పును సైతం ప్రకటించింది.
టీఎస్ ఈఏపీసెట్‌ను(TS EAPCET) మే 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజుల పాటు టీఎస్ ఈఏపీసెట్ జరుగుతుందని పేర్కొంది. మే 6న ఈసెట్, మే 23న టీఎస్ ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, పీజీఎల్ సెట్లు, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఎంటెక్, ఎంఫార్మ్ కోర్సుల్లో చేరే వారి కోసం జూన్ ఆరు నుంచి 8 వరకు పీజీ ఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు టీఎస్ పీఈసెట్ జరుగుతుందని స్పష్టం చేసింది.
Government about TS Eamcet : గత కొన్ని రోజుల నుంచి ఉన్నత విద్యామండలి ఎంసెట్ పేరును మార్చాలని కసరత్తు చేసింది. 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలిగించగా ఎంబీబీఎస్(MBBS), ఇతర వైద్య కోర్సులను నీట్(NEET) ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటకీ ఎంసెట్ పేరులో మెడికల్ పేరు అలాగే కొనసాగుతోందని, దాన్ని తొలగించే దిశగా ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి మెడికల్ పేరును తొలగిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తొలగించి తాజాగా టీఎస్ ఈఏపీసెట్‌గా మార్చింది. టీఎస్ ఎంసెట్‌లో ఎం అంటే మెడికల్ పేరు వస్తుందని, దానికి బదులుగా పీ అనే అక్షరాన్ని చేర్చారు. పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరంగా మార్చారు.
మరోవైపు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy)పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇదికాగా ఈసారి పీజీ ఇంజినీరింగ్ సెట్లో పరీక్ష విధానాన్ని మార్చాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
IBPS జాబ్ క్యాలెండర్ విడుదల - క్లర్క్, పీవో పరీక్షలు ఎప్పుడంటే?