Tributes to Ramojirao : జననమూ, మరణమూ, ప్రతి మనిషి జీవితంలో సాధారణ విషయాలే. కానీ అతి కొద్దిమంది మాత్రమే తరతరాల పాటు తమ ముద్రను శాశ్వతంగా వేయగలుగుతారు. విజయాలకు విలువలను జోడించిన అసమాన వ్యక్తి, అసాధారణ శక్తి కాబట్టే రామోజీరావుకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు భాష్పాంజలులు ఘటించాయి. గురువారం రోజు దేశం అంతటా రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు. ప్రతి కార్యాలయంలోనూ రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాంజలులు సమర్పించారు. సంస్థ ఛైర్మన్‌గా వారు చూపిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు.
ఒక వ్యక్తి కోటికాంతుల మణిహారం - అదే రామోజీరావు భావజాలం
రామోజీరావు జూన్ 8న మహాభినిష్క్రమణం చెందగా, నాటి నుంచి ఆయన స్మృత్యర్థం 11 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో, పలు దేశాల్లోనూ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు పలువురు కేంద్రమంత్రులూ, జాతీయ, ప్రాంతీయ నాయకులు, సినీ దిగ్గజాలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులూ రామోజీ ఫిలింసిటీలోని ఆయన నివాసానికి వచ్చి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మీడియా అనేది ఎంతో పవిత్ర వ్యాపకంగా భావించిన రామోజీరావు, ఎందరో సుశిక్షితులైన పాత్రికేయులను తీర్చిదిద్దారు. ఆయన సేవలను తల్చుకుంటూ అనేక మంది సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయ శిఖరం రామోజీరావు గారికి అక్షరాంజలి పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలుగు దిన పత్రికకు జాతీయ స్థాయి గౌరవం తీసుకు వచ్చిన ఘనత రామోజీరావుదని పలువురు సీనియర్ పాత్రికేయులు కొనియాడారు. అవకాశం ఉన్నా రాజకీయ పదవులు, ప్రచారం కోసం పాకులాడని నిరాడంబరత రామోజీరావు సొంతమని కీర్తించారు.
యావత్ భారతమంతా ఘన నివాళులు : తమకు జీవితాన్ని ఇచ్చిన రామోజీరావుకు రామోజీ ఫిల్మ్‌సిటీ ఉద్యోగులు అంజలి ఘటించారు. ఉపాధి చూపి కుటుంబాలకు అండగా నిలిచిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఆయన సేవలను స్మరించుకున్నారు. రామోజీరావు సంస్మరణార్థం ఫిల్మ్‌సిటీలో గురువారం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు పత్రిక జిల్లా యూనిట్ కార్యాలయాల్లో రామోజీరావుకు నివాళి అర్పిస్తూ సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఉద్యోగులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. తమ జీవితాలను రామోజీరావు ఉన్నతంగా తీర్చిదిద్దిన తీరును వారు జ్ఞాపకం చేసుకున్నారు. యూనిట్ కార్యాలయాల్లో అన్నదానం నిర్వహించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ భారతమంతా రామోజీరావుకు ఘనంగా నివాళి అర్పించాయి.
పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రెస్‌క్లబ్బుల ఆధ్వర్యంలో ఆయనకు అంజలి ఘటించారు. భారతీయ పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలను కీర్తించారు. రామోజీరావు సేవలను గుర్తు చేసుకుంటూ వివిధ సామాజిక సేవా సంస్థలు కూడా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీలో ద్వారకామయి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
చెరిపేస్తే చెరగని పేరు రామోజీ : రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు. చెరిపేస్తే చెరగని పేరు రామోజీరావు. ఆ పేరు నాకు కావాలి అంటూ చరిత్ర తనలో ఇముడ్చుకుంది. ఆ పేరును చూసి స్ఫూర్తి పొందండి అంటూ ప్రస్తుత, భావితరాల వారికి చాటిచెబుతోంది. ఆ పేరును తల్చుకుని జీవితాలను తీర్చిదిద్దుకోండి అంటూ పాఠాలను బోధిస్తోంది. ఆ పాఠాలను ఆలకించి, వాటిని జీవితానికి అన్వయించుకుంటే అది రామోజీరావుకు అర్పించే నిజమైన, ఘనమైన నివాళి.
మీడియా మొఘల్ రామోజీ రావు జీవన సూత్రాలు మీకోసం - Ramoji Rao Life Principles
1969లోనే కర్షకుల కోసం రామోజీరావు సంకల్పం - అన్నదాతతో మెలకువలు - Ramoji Rao Annadata Programme