Restoration of Trains Between Vijayawada-Hyderabad : రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి, మరిన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. దెబ్బతిన్న ట్రాక్‌లను సరిచేసే పనిలో పడింది. కాజీపేట-విజయవాడ సెక్షన్లో వానలకు దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.
తాజాగా భారీ వర్షాలతో కోతకు గురైన మహబూబాబాద్‌లోని రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తయినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇంటికన్నె - కే.సముద్రం మధ్య ట్రాక్ కిందిభాగం వరదకు కొట్టుకుపోగా, సుమారు 500ల మంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపట్టారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ మార్గంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా రైళ్ల రాకపోకలు అప్‌లైన్‌లో కొనసాగుతాయన్నారు. డౌన్‌లైన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని సాయంత్రం వరకు ఈ మార్గంలోనూ నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెండులైన్లు అందుబాటులోకి వస్తే రద్దయిన రైళ్లను వరసగా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో వరద విలయ తాండవం సృష్టించి మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే స్టేషన్ శివారులో 418కిలో మీటరు మైలురాయి వద్ద 42 మీటర్ల పొడవున రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాలిలో తేలాయి. వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. రైల్వే శాఖ సిబ్బంది నాలుగు రోజులుగా రైలు పట్టాల మరమ్మతు పనులు చేపట్టారు. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్స్ విభాగం విద్యుత్ సరఫరా లైన్ పనులు, కమ్యూనికేశన్స్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.
బుధవారానికి అందుబాటులోకి : వర్షం పడుతుండడం, నీటి ప్రవాహం వస్తుండటంతో పెద్ద పెద్ద బండరాళ్లతో అడ్డుకట్టలా వేస్తున్నామని, బుధవారం ఉదయానికి ఒక లైన్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకల్ని ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. సాయంత్రానికి రెండో లైన్‌ను అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు.
563కు రద్దయిన రైళ్ల సంఖ్య : కాజీపేట - విజయవాడ మార్గంలో మంగళవారం పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు రద్దయిన రైళ్ల సంఖ్య 563. 185 రైళ్లను దారి మళ్లించి మరీ నడుపుతున్నారు. 3, 4 తేదీల్లో పదుల సంఖ్యలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.
ప్రయాణికులకు ముఖ్య గమనిక - వర్షాల కారణంగా 481 రైళ్లు, 570 ఆర్టీసీ బస్సులు రద్దు - TRAINS CANCELLED