Vijayawada - Hyderabad Train Services Restarted: తెలంగాణలో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి, మరిన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ - హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వెళ్లే రైళ్లను వరంగల్ మీదుగా పంపిస్తున్నారు.
ట్రయల్ రన్‌లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను తొలుత అధికారులు పంపారు. ఈ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, గుంటూరు, వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లింది. అప్‌లైన్‌లో సర్వీసులను పునరుద్ధరించామని డౌన్‌లైన్‌లో అర్ధరాత్రి సమయానికి పనులు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
కొన్ని రైళ్ల సర్వీసులు రద్దు, దారి మళ్లింపు: అయితే బుధ, గురువారాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సికింద్రబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి, గరీబ్‌రథ్ రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. దీంతో ఈ రెండు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించనున్నారు. దీంతో పాటు మహబూబ్‌నగర్- విశాఖ, ముంబయి ఎల్‌టీటీ- విశాఖ, సికింద్రాబాద్- కాకినాడ టౌన్, బీదర్ -మచిలీపట్నం రైళ్లను సైతం పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు.
ఆలస్యంగా నడవనున్న పలు రైళ్లు: సికింద్రాబాద్- విశాఖపట్నం గరీబ్‌రథ్ రైలు రాత్రి 8.30 గంటలకు బయల్దేరాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంతో రీషెడ్యూల్ చేశారు. హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు సాయంత్రం 5.05 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉండగా 6.35 గంటలకు రీషెడ్యూల్ చేశారు. హైదరాబాద్- పట్నా ఎక్స్‌ప్రెస్ (07255) రాత్రి 10.50 గంటలకు బయల్దేరాల్సి ఉండగా అర్ధరాత్రి 1.30 గంటలకు, సిర్పూర్ -కాగజ్‌నగర్ రైలు మధ్యాహ్నం 3.35 గంటలకు బయల్దేరాల్సి ఉండగా రాత్రి 7.35 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఆఫర్: భారీ వర్షాలు, వరదలతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.inలో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.