Tractor Accident In Peddapalli : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ కూలీలను తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల వివరాల ప్రకారం, సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన 9 మంది కూలీలు ఈరోజు ఉదయం రేగడి మద్దికుంట గ్రామ శివారులో మొక్కజొన్న చేనులో పనికి వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ ఉప కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, రాధమ్మ, వైష్ణవి అనే ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామంలోని ముగ్గురు కూలీలు మృతి చెందడంతో చిన్న బొంకూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో నెత్తురోడిన రహదారులు - వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం