Tomato Prices Fall Down in AP : ఆరుగాలం శ్రమించి, రూ.లక్షల ఖర్చు చేసి టమాటా సాగుచేస్తే కనీసం పెట్టుబడి రావడం లేదని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనమై రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు (Affordable Prices) లభించక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Tomato Farmers Problem in Chittoor: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా పంటకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గాయి. చేతికి అందిన కాస్తా పంట నాణ్యత లోపించింది. 15 కిలోల పెట్టె జూన్‌లో రూ.800- రూ.1000 మధ్య ధర ఉండేది. ప్రస్తుతం రూ.250- రూ.300 మాత్రమే వస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో పలుచోట్ల కూలీల ఖర్చు కూడా రావడం లేదని రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు.
పెట్టుబడులు పెరిగినా నాటి ధరే : టమాటా సాగులో ఏటికేడు పెట్టుబడులు పెరిగిపోతున్నాయని అన్నదాతలు పేర్కొన్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల - రూ.2 లక్షల వరకు ఖర్చవుతోందని తెలియజేశారు. మూడేళ్ల కిందట ఇందులో సగం ఖర్చులే వచ్చేవని తెలిపారు. అప్పుడున్న ధరలే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలో జాతీయ రహదారిపై టమాటా రైతుల ఆందోళన - Tomato Farmers Agitation
మిగిలేది నష్టమే : వాతావరణ పరిస్థితులన్నీ సహకరిస్తే 15 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ కారణాలతో 10 క్వింటాళ్లకు మించడం లేదని వెల్లడించారు. టమాటా కోతలు, మార్కెట్‌కు తరలింపు, రవాణా, ఎగుమతి, దిగుమతి ఖర్చులు లెక్కిస్తే ఒక్కో బాక్సుకు రూ.40 వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు. ఒక్కో బాక్సుకు కమీషన్ రూ.10 ఇచ్చుకోవాల్సిందేనని పేర్కొన్నారు . ఇలా అన్నింటిని భరించి విక్రయించినా ప్రస్తుత ధరలతో నష్టమే మిగులుతుందని వాపోతున్నారు.
పులిచింతల ప్రాజెక్ట్‌కు కృష్ణమ్మ పరవళ్లు - సంతోషంలో రైతులు - Pulichintala Project Gates Lifted
ఊరించి, ఉసూరుమనిపించి : మే, జూన్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో రైతులు టమాటా పంటను అధికంగా సాగు చేశారు. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో టమాటా ధరలు పెరుగుతాయి. పొరుగు రాష్ట్రాల్లో పంట లేక అక్కడి వ్యాపారులు తెలుగు రాష్ట్రాలకు రావడమే ఇందుకు కారణం. జులై, ఆగస్టులో వాతావరణం చల్లబడి టమాటా దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తెగుళ్లు సోకి, ఊజీ ప్రభావంతో దిగుబడులు తగ్గాయి. దీంతో టమాటా రైతులకు నష్టాలు అధికమయ్యాయి.