TTD Chairman BR Naidu about Tirumala : తనకు టీటీడీ ఛైర్మన్ పదవి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. ఏ సందర్భం వచ్చినా కొండకు వెళ్లడం తనకు అలవాటని చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారికి నీతి, నిజాయతీగా సేవ చేస్తామన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే అయ్యుండాలని స్పష్టం చేశారు. తిరుమలలో పారిశుద్ధ్యం విషయంలో బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఏం చేయాలనే దానిపై త్వరలో చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్పారు.
తిరుమలలో తమ సొంత ఖర్చులు తామే భరిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో వ్యర్థాల నుంచి దుర్గంధం వస్తోందని, వాటిని తీసేయాలని పేర్కొన్నారు. భక్తులకు గంటలోగా దర్శనం పూర్తి కావాలనేది తన ఆలోచన అని, దర్శనం విషయంలో గతంలో ఉన్నట్లు టోకెన్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. చిత్తూరులోనే పుట్టి పెరిగానని, చిన్ననాటి నుంచే ఏ కష్టం వచ్చిన ఆ దేవునికే చెప్పుకునేవాళ్లమని చెప్పారు. గతేడాది నుంచే తిరుమలలో ఏ విధంగా బాగుచేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అక్రమాలు, అరాచకాలు చేసిందని ధ్వజమెత్తారు.
"నన్ను టీటీడీ ఛైర్మన్ చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు.స్వామివారికి నీతి, నిజాయతీగా సేవ చేస్తాం. తిరుమలలో పారిశుద్ధ్యం విషయంలో బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తిరుమలలో మా సొంత ఖర్చులు మేమే భరిస్తాం.తిరుమలలో వాటర్ దందా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం" -బి.ఆర్.నాయుడు, టీటీడీ ఛైర్మన్
శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని అభిప్రాయం : ఐదేళ్లుగా అక్కడికి వెళ్లాలని అనిపించలేదని నూతన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలని తన ఆలోచన అని, ఒక పెద్ద ట్రస్ట్ ఉన్నప్పుడు మరో ట్రస్ట్ ఎందుకని ప్రశ్నించారు. టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని, గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని అన్నారు. మెటీరియల్ సప్లై పై, దేవస్థానం భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ, అస్పత్రులపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కొండపై గాజు బాటిళ్లతో నీళ్లు భక్తులకు భారంగా మారాయని, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా అందిచేలా చేస్తామని చెప్పారు.