Tirumala and Tirupati There are Srivari Features in Inscriptions : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలకు నెయ్యి వినియోగం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీవారి పూజా కార్యక్రమాల్లో నైవేద్యాలకు అత్యంత విశిష్ట ప్రాధాన్యత ఉంది. వీటి తయారీ, స్వామి వారి జరిగే ఇతర సేవల గురించి శాసనాల్లో ప్రస్తావన ఉంది. 1150 వరకు ఉన్న శాసనాల్లో అధికశాతం తిరుమల, తిరుపతిలోని ఆలయ ప్రాకారంపై దర్శనం ఇస్తాయి. ఈ శాసనాలన్నీ క్రీ.శ 8 నుంచి క్రీ.శ 18వ శతాబ్ద కాలానికి చెందినవే.
తిరుమల, తిరుపతిలో పలు గోడలపై శాసనాలు : పల్లవ, చోళ, పాండ్య, కడవరాయలు, యాదవరాయలు, విజయనగర రాజులు, మంత్రులు, సామంతులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంతో భక్తితో సేవించి తరించారు. స్వామి వారికి పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు. అందుకు సంబంధించిన వివరాలు శాసనాల్లో పొందుపరిచారు. స్వామి వారికి చెందిన భూముల్లో పండించే పంటలను పండగలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా నైవేద్యాలు తయారు చేసేందుకు ఉపయోగించారు. స్వామి వారి ప్రసాదాలు తయారీ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, సంప్రదాయాలు, వంటగది నాణ్యత, కొలతలకు సంబంధించిన వివరాలను కూలంకుషంగా ప్రస్తావించారు.
కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మాండోత్సవం - నేడు సింహ వాహనంపై శ్రీవారు - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM
నైవేద్యానికి పెద్ద ఎత్తున విరాళాలు : పల్లవ వంశానికి చెందిన కడవన్ పెరుందేవి అనే రాణి కలియుగవాసుడికి ఆహార నైవేద్యాలు అందించేందుకు అవసరమైన భూమి కొనుగోలు చేసేందుకు 4,176 బంగారు నాణేలు విరాళంగా అందించారు. ఇలా చాలా మంది రాజులు క్రీ.శ 18వ శతాబ్దం వరకు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తూ వచ్చారు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ 1509 నుంచి క్రీ.శ 1529 వరకు 7 సార్లు శ్రీవారిని సందర్శించారు. ఆయన తన సతీమణులైన తిరుమలదేవి, చిన్నాదేవిలతో కలిసి స్వామివారికి వజ్ర వైడూర్యాలు సమర్పించారు. నైవేద్యాల సమర్పినందుకు బంగారు పాత్రలు బహూకరించారు.
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు - వైభవంగా అంకురార్పణ - Tirumala Srivari Brahmotsavam
శ్రీవారికి నిత్య సేవలు సభ : క్రీ.శ 1019లో తిరుమల మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై ఉన్న శాసనం రాజేంద్ర చోళుడు-1 (Rajendra Choludu-1) తమిళంలో వేయించారు. ఇందులో నెయ్యి తరలింపు, స్వామివారి సేవకు వినియోగించే పద్దతి గురించి ప్రస్తావించారు. స్వామి వారికి 24 నేతి దీపాలు వెలిగించే వారని వెల్లడించారు. అప్పట్లో ‘తిరువేంగట దేవర్’గా కొలిచిన శ్రీవారికి నిత్య సేవలు సభ ఆధ్వర్యంలో జరిగేవి అని తెలియజేశారు. వాటిని సక్రమంగా చేపట్టడం లేదని గుర్తించి విచారణ అనంతరం వారి ఆధీనంలో ఉన్న నెయ్యి, నిధులను దేవాలయ భాండాగారానికి ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో పాటు దేవాదాయ అధికారులు దీపారాధన చేయాల్సిందిగా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.