Tiger Movement In Adilabad District : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చింతలబోరి గ్రామశివారులోని ఫారెస్ట్ సిబ్బందికి మంగళవారం కనిపించిన పెద్దపులి బుధవారం చింతగూడ పరిసరాల్లో ఉదయం 6 గంటలకు ఓ మహిళకు కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారమిచ్చింది. గ్రామస్థులు వెళ్లి చూడగా ఆ వ్యాఘ్రం అప్పటికే పత్తి చేనులో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. కొంతసేపటి తర్వాత కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టేసిన ఎద్దులు పులిని చూసి తాళ్లు తెంపుకొని గ్రామానికి పరుగు తీశాయి.
పులికోసం జల్లెడపడుతున్న అటవీ సిబ్బంది : చింతగూడ గ్రామస్థులకు కొండ సమీపంలోని పత్తి చేనులో పెద్దపులి అడుగుజాడలు (పాదముద్రలు) కనిపించాయి. బుధవారం సుమారు 20 మంది బేస్‌క్యాంపు సిబ్బంది పులిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బాబెరతండాలోని జాదవ్ దిలీప్‌నకు చెందిన ఎద్దుపై చింతగూడ ఫారెస్ట్ ఏరియాలోని పెద్దపులి దాడి చేసి చంపినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. ఇటీవల కాలంలో వన్యప్రాణులు తరచూ జనావాసాలకు సమీపంలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు అటవీ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతుండటంతో వాటి అవాసాలకు నష్టం వాటిల్లుతోంది.
అక్కడ సంచరించింది చిరుత పులి కాదు పిల్లి : ఇటీవల మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక బాగంలో చిరుతపులి సంచరిస్తోందంటూ వచ్చిన వార్తలు ఇటీవల కలకలం రేపాయి. ఆ దృశ్యాలను కూడా కొంతమంది సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి వైరల్‌గా మారడంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు మెట్రో స్టేషన్‌కు సమీపంలోని నడిగడ్డ తండా ప్రాంతమంతా జల్లెడ పట్టారు. చివరకు ఆ జంతువు పాదముద్రలను గుర్తించిన అధికారులు అది పులి కాదని అడవి పిల్లిగా నిర్ధారించారు.
జనావాసాలకు దగ్గరలో పులి సంచారం : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. తాడోబా అభయారణ్యాల నుంచి కాగజ్‌నగర్ అటవీ ప్రాంతానికి వచ్చిన ఎస్-13 పులి జనావాసాలకు అతి సమీపంలో సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంత సమీపంలోకి చేలకు వెళ్లకూడదని హెచ్చరించారు.
అలర్ట్ : 'అక్కడ కనిపించింది చిరుతపులే - ఎవరూ ఒంటరిగా తిరగొద్దు'