Young People Running a Creamy Millet Ice Cream Business : నలుగురు వెళ్లే దారిలో వెళ్తే నలుగురిలో ఒకరిలా మిగిలిపోతారు. అదే భిన్నంగా చేస్తే పది మందిలో ప్రత్యేక గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆ రెండో దారినే ఎంచుకున్నారు ఆ యువకులు. చిరుధాన్యాల వాడకంపై అవగాహన కల్పిస్తూ వాటి వాడకాన్ని ప్రోత్సహించే ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేసే వారంతా మిల్లెట్స్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలా అని మేధోమథనం సాగించారు. వారి ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే మిల్లెట్ ఐస్ క్రీమ్. చిన్నాపెద్దా వయసుతో తేడా లేకుండా - అందరూ ఆసక్తిగా తినేలా దాంట్లో భిన్నమైన ఫ్లేవర్లతో ప్రజల మనసు చూరగొన్నారు. జీ-20 సదస్సులో అతిథులకు రుచి చూపించి ఔరా అనిపించుకున్నారు. రైతుల నుంచి నేరుగా చిరు ధాన్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు కొని వాటితో ఐస్ క్రీమ్ తయారు చేసి రూ.25 లక్షలకు పైగా టర్నోవర్‌తో దూసుకుపోతున్నారు క్రీమీ మిల్లెట్ వ్యవస్థాపకులు.
నలుగురికి ఉపయోగపడేలా : సాధించాలనే తపన, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే మార్గం అదే కనిపిస్తుంది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో పుట్టిన కొందరు యువకుల మధ్య కుదిరిన స్నేహం, అభిప్రాయాలు, ఆలోచనలు కలవడంతో క్రీమీ మిల్లెట్ సంస్థ స్థాపనకు దారి తీసింది. వ్యాపారం అంటే లాభాల కోసం కాదు చేసే పని నలుగురికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మిల్లెట్స్‌తో ఐస్ క్రీమ్ తయారు చేయాలని సంకల్పించారు. ఉన్నత విద్యలను పూర్తి చేసిన ఈ యువకులు, తమ మూలాలను మరిచిపోకుండా ఉన్నత చదువులు చదివాం కాబట్టి ఉద్యోగాలే చేయాలి అనే మూస ధోరణిలో పోకుండా ప్రత్యేకంగా ఒక ఎన్జీవోను ప్రారంభించి మిల్లెట్స్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేవారు.
YUVA: 20 బైక్‌లతో మొదలై 2 వేల ఈవీ వాహనాల వ్యాపారం - అంకుర సంస్థ అద్భుతం
అయితే వాటి వాడకాన్ని ప్రజల్లోకి మరింత బాగా తీసుకెళ్లడం ఎలా అని ఆలోచించారు. మిల్లెట్స్ తినాలి అందరూ మూలాలను మరిచిపోవద్దు అని చెప్పిన వీరు మిల్లెట్స్‌తో వినూత్నంగా ఐస్ క్రీమ్ చేయటం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఓ చిన్న స్టోర్‌లో ప్రారంభించి నేడు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. సమాజంలో మార్పు రావాలనే చిన్న ఆశతో ప్రారంభమైన ఈ స్టాల్, దేశీయ మార్కెట్‌లో తన ప్రత్యేకత చాటుతోంది.
మదిలో ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని ఆచరణలో పెట్టడానికి చాలా అవరోధాలు ఎదురవుతుంటాయి. కానీ ఇష్టమైన పనిని చేస్తున్నప్పుడు ఎంతటి కష్టమైనా చాలా సులభంగా అధిరోహించగరని నిరూపించారీ యువకులు. సరదాగా ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకునే వీరు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే కూడా బాగుంటుందని తలంచి మూడేళ్ల పాటు రీసెర్చ్ చేసి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఐస్ క్రీమ్‌ను తయారు చేశారు.
పలు కార్యక్రమాల్లో ప్రదర్శించి : ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మిల్లెట్స్‌తో ఇంత బాగా కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చా అనిపించేలా పేరు సంపాదించుకున్నారు. జీ -20 సమ్మిట్‌లో తమ ఐస్ క్రీమ్‌ను అందించి అందరి నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఏసియన్ ఇండియన్ మిల్లెట్ కాంక్లేవ్, హైసియా ఈఎస్జీ కాంక్లేవ్‌లలో తమ ప్రొడక్ట్‌ను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఇంటర్నేషనల్ న్యూట్రీ సివిల్ కన్వెన్షన్ నుంచి అవార్డును పొందారు.
YUVA : ఇన్నోవేషన్, సొల్యూషన్స్ - ఈ రెండింటి కలయికే మహాత్మాగాంధీ వర్సిటీ టెక్నోవేషన్
ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు వెనక్కి లాగే వారు చాలా మంది ఉంటారు. వీరి విషయంలోనూ అదే జరిగింది. మిల్సెట్స్‌తో ఐస్ క్రీమ్ అంటే ఇది అయ్యే పనేనా అని చాలా మంది అన్నారు. కానీ రశ్మిత మాత్రం ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది, దీనిని ముందుకు తీసుకెళితే బాగుంటుంది అని ఆలోచించి వీరికి ఆర్థికంగా సాయం అందించటంతో స్టోర్‌ను ప్రారంభించారు ఈ యువకులు. కొన్నిసార్లు చిన్న ప్రోత్సాహమే ఎన్నో అద్భుతాలను సృష్టించగలదు అంటోంది రశ్మిత.
ఆరోగ్య హబ్‌గా మార్చి : మిల్లెట్స్ మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఏర్పాటయిన తరుణి ఎన్జీవో ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ యువకులు. అటు ప్రజలను, ఇటు రైతులను మోటివేట్ చేస్తూ మిల్లెట్స్‌ను పండించటం, వాటిని తినటంపై అవగాహన కల్పించారు. వీరు స్థాపించిన క్రీమీ మిల్లెట్ ద్వారా నేరుగా రైతుల నుంచి పంట ఉత్పత్తులు, ఆర్గానిక్ ఫ్రూట్ పల్ప్, తాటి బెల్లం వంటివి కొంటారు. ఆరోగ్య హబ్‌గా ఉన్న ఈ క్రీమీ మిల్లెట్‌ను మరిన్ని మెట్రో పాలిటన్ సిటీస్‌లో విస్తరించాలనేదే తమ లక్ష్యమంటున్నారు ఈ యువకులు. 2023లో స్థాపించిన తమ సంస్థ రూ.25 లక్షల టర్నోవర్‌ను సాధించిందని అంటున్నారు.
YUVA : ఐటీ ఉద్యోగం చేస్తూనే సోషల్ సర్వీస్ - 'వీటీవీవో'తో 15 రకాల సేవలు
YUVA: ఆర్టీసీ ఎండీనే మెప్పించిన ఈ చూపులేని గాయకుడి గురించి మీకు తెలుసా?