AP People Died in Road Accident in America : అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వారిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీకి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) 2 వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు తెలిపాయి. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్వాపరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అక్కడి ప్రవాస భారతీయ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనను ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. కేవీబీ పురం మండలంలోని కాలంగి ఆదవరానికి చెందిన దంపతులు సాయి తేజ, హరిత శ్రీకాళహస్తిలో ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కిందట వివాహం కాగా జనవరిలో అమెరికా వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో హరిత అక్కడికక్కడే మృతి చెందగా సాయితేజ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి - Telangana Students Died In America