Congress MP Candidates Second List : తొలిజాబితా ద్వారా రాష్ట్రంలో 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, ఇవాళ్టి జాబితాలో మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో నాగర్‌కర్నూల్ కాంగ్రెస్(Congress) ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిలను ఏఐసీసీ ఎంపిక చేసింది.
CONGRESS PARLIAMENT CANDIDATES 2024 : ఇక తొలి జాబితాలో మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ(CWC) ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇంకా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఇందిరతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఖమ్మం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తుండగా ఇక్కడ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తీవ్ర కసరత్తులు చేయాల్సి వస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్న వీహెచ్ పోటీ తీవ్రంగా ఉన్నందున తప్పుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఏఐసీసీ హామీ మేరకు ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడి నుంచి వెలిచల రాజేంద్రరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, ఆరంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సర్వే నివేదిక ఆధారంగానే ఇక్కడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మస్కతి డెయిరీ యజమానిని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.
ఆదిలాబాద్ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్ధి లేకపోగా బలమైన నాయకుడి కోసం వేట సాగిస్తున్నారు. భువనగిరి నుంచి బరిలో దిగేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కానీ ఇక్కడ చామలకు టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ నుంచి కోమటిరెడ్డి భార్య లక్ష్మీ, సూర్య పవన్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
'ఫ్రీజ్ అయింది కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కాదు, దేశ ప్రజాస్వామ్యం!' - Congress Allegations On BJP