Pakisthan Colony In Vijayawada: ఈ కాలనీ పేరు పాకిస్థాన్ కాలనీ. ఈ కాలనీకి 40ఏళ్ల చరిత్రే ఉంది. ఇదెక్కడో కాదండీ మన ఏపీలోనే. అదీ రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉండే విజయవాడలో. ఈ కాలనీ పక్క వీధిలో ఉండే వాళ్లని అడిగినా చాలా మంది పాకిస్థాన్ కాలనీయా? అదెక్కడ ఉందని తిరిగి ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్ కాలనీ పాకిస్థాన్ లో ఉంటుంది. ఇండియాలో ఎందుకు ఉంటుందన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కాలనీకి ఈ పేరు ఎలా వచ్చింది. ఏంటా పాకిస్థాన్ కాలనీ కథ. ఇంతకీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లు పాకిస్థాన్ వాళ్లా? లేక విజయవాడకు చెందిన వాళ్లేనా అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
పాకిస్థాన్ కాలనీ కథ: ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 1971 యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ చీలిపోయింది. దీంతో పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అప్పటి ప్రభుత్వం ఆ కుటుంబాలకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు. అందులో భాగంగా నగరంలోని పాయకాపురం ప్రాంతంలో 40 ఇళ్లతో కూడిన ఓ చిన్న కాలనీని నిర్మించారు. 1984లో 40గృహాలు 3 రోడ్లతో నిర్మించిన ఈ కాలనీ 1986 సంవత్సరం నాటికి పూర్తయింది. అప్పట్లో ఈ కాలనీకి పాకిస్థాన్ కాలనీగా నామకరణం జరిగింది. అయితే పాకిస్థాన్ సరిహద్దుల నుంచి ఏ ఒక్క కుటుంబం ఇక్కడికి నివాసం ఉండడానికి రాలేదు. దీంతో కాలనీ దెబ్బ తిని నిర్మానుష్యంగా మిగిలిపోయింది.
3 దశాబ్దాల క్రితం పాయకాపురం ప్రాంతాన్ని బుడమేరు వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో ఎంతో మంది ఇళ్లు నీటమునిగాయి. నీట మునిగిన కుటుంబాలను అధికారులు ఈ కాలనీలోని ఇళ్లల్లోకి తరలించారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల కంటే కాస్త ఎత్తులో ఉండేది. అందుకే పదుల సంఖ్యలో అనేక మంది ఈ ఇళ్లల్లో తలదాచుకున్నారు. ఈ వరదల్లో వీళ్లు సర్వం కోల్పోయారు. మట్టి ఇళ్లు కావడంతో ఇళ్లు పూర్తిగా ఆనవాలు లేకుండా పోయాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ పాకిస్థాన్ కాలనీలోనే స్థిరపడిపోయారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధలో ఉండే వీళ్లను చూసి అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం సర్లే అని వదిలేయడంతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
ఎట్టకేలకు తొలగిన ఆంక్షలు- తాడేపల్లి పరిసర ప్రజల్లో ఆనందోత్సాహాలు - Tadepalli Palace Road
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి: ప్రస్తుతం పాకిస్థాన్ కాలనీలో 58 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కొద్ది మంది తమ ఇళ్లను సైతం అమ్ముకున్నారు. గతంలో ఉండే ఇళ్లలో సగం భాగం మరికొంత మంది అమ్ముకున్నారు. 2012లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 8మందికి రిజిస్ట్రేషన్ తో కూడిన ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం 32మందికి బీఫాం పట్టాలు మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ 17ఇళ్లకు ఎటువంటి పట్టాలు లేవు. అయితే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు 105జిఓ ద్వారా అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాకిస్థాన్ కాలనీ వీఎంసీ పరిధిలోని 62వ డివిజన్ కిందకి వస్తుంది. ప్రకాష్ నగర్ లో భాగంగా ఈ పాకిస్థాన్ కాలనీ ఉంది. తామంతా గత ఇరవై ఏళ్ల నుంచి ఇంటి పన్నులు కడుతున్నామని స్థానికులు తెలిపారు. తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి కాలనీ పేరు మార్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీ సమస్య మెరుగుపరిచాలని విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్ పేరుతో ఇబ్బందులు: ఈ కాలనీకి పాకిస్థాన్ పేరు ఉండడంతో ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాలకు వెళ్లాలన్నా, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల్లో చేరాలన్నా పాకిస్థాన్ కాలనీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో గతంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఉపాధి సైతం కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. తమ కాలనీకి భగీరథ కాలనీగా మార్చాలని వీఎంసీని కోరామని దీనికి వీఎంసీ కౌన్సిల్ సైతం ఆమోదం తెలిపిందని స్థానికులు చెబుతున్నారు. త్వరలో తమ కాలనీకి భగీరథ కాలనీగా నామకరం చేస్తామని చెబుతున్నారు.