TGSRTC on Electric Buses in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 102 ఎలక్ట్రికల్ బస్సులను తిప్పుతున్నారు. వీటికి అదనంగా మరో 438 బస్సులను విడుతల వారీగా తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. కేవలం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కాకుండా వాటికి అవసరమైన ఈవీ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 102 ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. అందులో 77 ఏసీ, 25 నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి.
వీటిలో 50 ఏసీ బస్సులను విమానాశ్రయ మార్గంలో తిప్పుతున్నారు. ఐటీ ఉద్యోగుల కోసం ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు చొప్పున బాచుపల్లి-వేవ్ రాక్‌కు 7 ఏసీ బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. కోఠి-కొండాపూర్ మార్గంలో 6, సికింద్రాబాద్-పటాన్చెరు మార్గంలో 14 ఏసీ బస్సులను నడిపిస్తున్నారు. 25 నాన్ ఏసీ బస్సుల్లో పటాన్చెరు-సీబీఎస్ మార్గంలో 6, పటాన్చెరు -హైటెక్ సిటీ మార్గంలో 5, సికింద్రాబాద్ -మణికొండ మార్గంలో 12, మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో 2 బస్సులను నడిపిస్తున్నారు.
ఐదు డిపోల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు : ఆర్టీసీ యాజమాన్యం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం పలు డిపోల్లో ఏర్పాట్లు చేసింది. కంటోన్మెంట్, మియాపూర్‌లో పనులు పూర్తయి విద్యుత్ సరఫరా జరుగుతుండగా మిగిలిన డిపోల్లో వేగంగా పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్లో పనులు పూర్తయినప్పటికీ చీఫ్ ఎలక్ట్రికల్ అధికారి అనుమతి ఇచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా ప్రారంభించనున్నారు. హెచ్.సీ.యూలో ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ యూనిట్‌ను నెలరోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేబీఎస్‌కు మరో ఛార్జింగ్ యూనిట్‌కు టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ఐదు డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు సిద్ధమైతే విడతలవారీగా 438 విద్యుత్ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లుపై ఫోకస్ : విడతలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పూర్తయ్యేలోగా ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించే దిశగా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందుకు సుమారు రూ.17 కోట్లను ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. ఐదు డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుకు నిర్ణయించగా కంటోన్మెంట్, మియాపూర్‌లో పనులు పూర్తయ్యాయి. ఒలెక్ట్రా సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నెలరోజుల్లో మరికొన్ని విద్యుత్ బస్సులు రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి.
కంటోన్మెంట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.1.24 కోట్లు, మియాపూర్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.35 లక్షలు, బీహెచ్ఈఎల్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.3.9 కోట్లు, హెచ్.సీయూ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.2.49 కోట్లు, జేబీఎస్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.9 కోట్లు ఆర్టీసీ ఖర్చు చేస్తోంది. ఒకవైపు బస్సులను సమకూర్చుకోవడంతో పాటు మరోవైపు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా వేగంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు.
TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్