TG High Court On Fee Regulation : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ నిమిత్తం 1994లో తీసుకువచ్చిన జీఓ, గత ఏడాది జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలుపై చర్యలను వివరించాలంటూ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. అదేవిధంగా ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, ఐసీడీఎస్ పథకం అమలుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ : ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ నిమిత్తం తీసుకువచ్చిన జీవో 1ను అమలు చేయకపోవడంపై హైదరాబాద్ కు చెందిన కె. అఖిల్ శ్రీగురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
వార్షిక నివేదికలు ప్రభుత్వానికి పంపడం లేదు : ప్రైవేటు పాఠశాలలు ఏటా వార్షిక నివేదికలను ప్రభుత్వానికి పంపాల్సి ఉండగా పంపడంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. 11,501 ప్రైవేటు పాఠశాలలకుగాను కేవలం 50 పాఠశాలలు మాత్రమే పంపాయన్నారు. ఇంజనీరింగ్ కోర్సులకే ప్రభుత్వం రూ.1.6లక్షల ఫీజును పరిమితిగా నిర్ణయిస్తే పాఠశాలలు రూ.8 లక్షల దాకా వసూలు చేస్తున్నాయన్నారు. ఫీజు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయడంలేదన్నారు.
నోటీసులు జారీ చేసిన హైకోర్టు : హైదరాబాద్లో 500 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 53వేల మందికి పైగా చదువుతున్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిబంధనల ప్రకారం అమలు చేయడంలేదన్నారు. ప్రతి పాఠశాలలోను గవర్నింగ్ బాడీ ఉండాలని, అందులో తల్లిదండ్రుల తరఫున ఒకరు ఉండాలని, అయితే ఈ నిబంధన అమలుకావడంలేదన్నారు. జీవో 1 ప్రకారం నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా విద్యాశాఖాధికారులు, ఆహార భద్రతా కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది
జీవో 33పై వివరణ ఇవ్వండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - TG HC on GO 33 for Medicine Course