Peddireddy vs Ramachandra Yadav: చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. సదూం మండలం యర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న BCYP పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు వేణుగోపాల్‌రెడ్డి వారితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. మంత్రి స్వగ్రామంలోనే ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ ఘర్షణకు దిగారు. కార్లు, ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ప్రచారం ముగించుకుని గొడ్లవారిపల్లెకు వెళ్లిన రామచంద్రయాదవ్‌పై మరోసారి వైకాపా శ్రేణులు పెట్రేగిపోయాయి. ఆయన వాహన శ్రేణిని ధ్వంసం చేయడంతోపాటు దాడికి యత్నించారు.
Y ప్లస్ భద్రత కలిగి ఉన్న రామచంద్రయాదవ్‌ను సురక్షితంగా సదూం పోలీసుస్టేషన్‌కు తరలించగా అక్కడ కూడా వైకాపా మూకలు దాడికి యత్నించారు. సాక్షాత్తు పోలీసుస్టేషన్ ఎదుటే దాడి జరుగుతున్నా స్టేషన్ ఆవరణలోకి చొచ్చుకొచ్చి దుర్భాషలాడుతున్నా కనీసం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. స్టేషన్ ఎదుటే BCYP ప్రచార రథం ధ్వంసం చేసి నిప్పుపెట్టినా పోలీసులు చూస్తూ ఉండిపోయారు.
రామచంద్రయాదవ్ స్టేషన్‌లోనే ఉన్నారని తెలుసుకున్న దాదాపు 200 మందికిపైగా వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలోకి వెళ్లి మరీ దాడి చేయాలని చూశారు. బయట ఉన్న కార్యకర్తలు కొందరు ప్రచార రథం జనరేటర్‌కు మంటపెట్టారు. పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికీ వైకాపా శ్రేణులు వెనక్కి తగ్గలేదు. పోలీసులూ అక్కడున్న వారిని చెదరగొట్టేందుకు యత్నించలేదు. దమనకాండను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లు అధికార పార్టీ కార్యకర్తలు లాక్కుని వీడియోలు డిలీట్ చేసి చితకబాదారు. ఎస్పీ మణికంఠ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
యర్రాతివారిపల్లెలో ప్రచారానికి వెళ్తే రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రచారానికి వెళ్తే సమస్య తలెత్తుతుందంటూ ఉచిత సలహా ఇవ్వడంపై రామచంద్రయాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి ఓటు అడిగే హక్కు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మంత్రికి సహకరిస్తున్నారని విమర్శించారు.
సదూం ఘటన గురించి తెలుసుకున్న వైకాపా శ్రేణులు మరింత రెచ్చిపోయారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపులబైలు వద్ద రెండు BCYP ప్రచార రథాలను అడ్డిగించి నిప్పుపెట్టారు. దీనిపై విపక్ష నేతలు మండిపడ్డారు.
రెండు రోజుల క్రితం సైతం ఇదే తరహాలో గొడవ: రెండు రోజుల క్రితం పుంగనూరు మండలంలోని మాగాండ్లపల్లెలోనూ బీసీవైపీకి ఇదే తరహా అనుభవం ఎదురైంది. రామచంద్రయాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. గ్రామంలోని వైసీపీ కార్యకర్త శశిభూషణ్‌రెడ్డికి కరపత్రం అందజేసే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. దాడిలో బీసీవైపీకి చెందిన ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఆ పార్టీ కార్యకర్త నారాయణ గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ నారాయణను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.