Muthyalamma Temple Vandalism Case Update : సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అమ్మవారి విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు. ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మీ పెరుమాల్ నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఆందోళనకారుల్లో కొందరి తలలకు, ఇతర శరీరభాగాలకు గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ దుర్గా అనే యువకుడు నేలపై కూలబడ్డాడు.
అసలేం జరిగింది : ఈనెల 24 అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అమ్మవారి ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఆలయం వద్దకు చేరుకొని నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహానికి లోనయ్యారు. స్థానికులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ముత్యాలమ్మ గుడి వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నాడు నెలకొంది. ఈ అంశంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం : అమ్మవారి విగ్రహం ధ్వంసంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించారు. అయితే ఇవాళ మళ్లీ స్థానికులు అమ్మవారి గుడి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగి లాఠీఛార్జీ జరిగింది. ఈ లాఠీఛార్జీలో పలువురికి గాయాలయ్యాయి.
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు - మోండా మార్కెట్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత