Telangana To Ayodhya Special Trains : అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి భక్తులకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం కలిగించింది దక్షిణ మధ్య రైల్వే. అయోధ్యకు వెళ్లడానికి కాజీపేట, వరంగల్ మీదుగా తక్కువగా రైళ్లు ఉన్నాయని ‘ఇలా ఐతే నీ వద్దకు చేరేదెలా రామయ్యా' అని ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమైంది. దీనికి స్థానిక ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్‌తో పాటు బీజేపీ నాయకులు రావు పద్మ, ప్రదీప్‌రావులు స్పందించారు.
భక్తుల సౌకర్యార్థం కాజీపేట నుంచి రైల్వే సేవలు అందించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఈ నేతలు వినతిపత్రాలు అందించారు. కేంద్ర రైల్వే మంత్రికి కూడా మెయిల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపారు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ కాజీపేట మీదుగా ఈనెల 30వ తేదీ నుంచి అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
అయోధ్యకు వారంలో రెండే రైళ్లు - ఇలా ఐతే నీ వద్దకు చేరేదెలా రామయ్యా?
Aastha Special Train To Ayodhya Dham : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తా ప్రత్యేక రైలును కాజీపేట, సికింద్రాబాద్‌ల నుంచి ప్రారంభించనుంది. కాజీపేట నుంచి 07223 నెంబరు రైలు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 మొత్తం 15 ట్రిప్పులు నడుపుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీలలో భక్తులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
Kazipet to Ayodhya Special Train : కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 7.02 గంటలకు కాజీపేటకు వస్తుంది. ఈ రైలు పెద్దపల్లి మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామం, నాగపూర్, జుజార్‌పూర్, ఇటార్సీ, బోపాల్, బినా, విరాంగన, ఝాన్సీ, ఒరాయ్, ఖాన్‌పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 20 స్లీపర్ కోచ్‌లు 2 జనరల్ బోగీలు ఉన్నాయి.
Hyderabad To Ayodhya Trains : సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీలలో ఉంటుంది. సికింద్రాబాదులో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 16.10 గంటలకు చేరుతుంది. ఇది కూడా కాజీపేట నుంచి బయలు దేరి ఆస్తా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది.్
ఉమ్మడి వరంగల్, సికింద్రాబాద్ ప్రజలకు ఆస్తా అయోధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం ప్రజలకు మంచి సౌకర్యం అని చెప్పవచ్చు. ఈ మార్గంలో ఎక్కువ ప్రయాణికులు కాగజ్‌నగర్ వరకు ప్రయాణిస్తారు. దీనిని రెగ్యులర్ రైలుగా మారిస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ఉత్తరప్రదేశ్ వెళ్లే కూలీ ప్రయాణికులకు ఇది మంచి సదుపాయం అని చెప్పొచ్చు.