Telangana Secures 23rd Position in State Food Safety Index : ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉంది. 2023-24వ సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో రాష్ట్రం వెనకబడి ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన భారతదేశ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తెలిపింది. ఆహార తయారీలో వివిధ అంశాలను పరిశీలించి, మార్కుల ప్రాతిపదికగా నాణ్యత తనిఖీలపై ర్యాంకులను ప్రకటించగా, 100 మార్కులకు తెలంగాణ 35.75 మార్కులతో 23వ స్థానంలో ఉంది. అత్యధిక మార్కులతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది.
పలు అంశాల్లో వెనకబడి : మానవ వనరుల అంశాల్లో నిర్దేశించిన ప్రమాణాల్లో తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉందని నివేదికలో పేర్కొంది. జనాభాకు తగిన మేర ఆహార నాణ్యాత తనిఖీ ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడం, రాష్ట్ర స్థాయి సలహా కమిటీ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాల్లో సగం కంటే తక్కువ ఉన్నట్లు తెలిపింది. లైసెన్స్‌ల జారీకి స్పెషల్ డ్రైవ్‌లు, క్యాంపుల నిర్వహణ, కొత్త రిజిస్ట్రేషన్‌లు, నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం, వినియోగదారుల ఫిర్యాదులు తీసుకోవడం, సహాయ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాల్లో రాష్ట్రం చాలా వెనకబడి ఉండటం ప్రధాన కారణం.
కుళ్లిన మాంసం, బూజుపట్టిన కూరగాయలు - ఆ రెస్టారెంట్లో తింటే అంతే! - Food Inspections in peddapalli
రాష్ట్ర ఆహార నాణ్యత తనిఖీ ప్రయోగశాలలు, ఎన్‌ఏబీఎల్ గుర్తింపు ఉన్న రాష్ట్ర లేబొరేటరీలు, వాటిలో పరికరాలు, సాంకేతిక సిబ్బంది, ల్యాబ్‌ల మ్యాపింగ్ సహా వివిధ అంశాల్లో వెనకబడి ఉందని వివరించింది. ఈట్ రైట్ ఛాలెంజ్ కార్యక్రమాల నిర్వహణ, పరిశుభ్రత రేటింగ్‌ల నిర్వహణ పరిమితంగానే ఉన్నట్లు తెలిపింది.
నిర్దేశించుకుని పూర్తి చేసి మొదటి ర్యాంకు : కేరళలో ప్రత్యేక డ్రైవ్‌లు సమర్థంగా నిర్వహిస్తున్నారు. కొత్తగా ఆహార విక్రయ కేంద్రాల లైసెన్స్‌లు భారీగా పెరిగాయి. 2023-2024 సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అధికారులు వంద శాతం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కూడా పెంచారు. ప్రయోగశాలలను పెంచడంతో వాటిలోని కొన్నింటికి ఎన్‌ఏబీఎల్ గుర్తింపు కూడా లభించింది. నాణ్యత ప్రమాణాలను వెల్లడించే అత్యాధునిక యంత్ర పరికరాలతో కూడిన వాహనాలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వినియోగదారుల సాధికారతకు పెద్దపీట వేశారు. గతం కంటే ర్యాంకును మెరుగుపర్చుకున్నారు. 'నాణ్యమైన ఆహారం' అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.