Telangana State Govt Planning To HYDRA Expansion : తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రాను, మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. జులై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు ఓఆర్ఆర్ లోపు ఉన్న పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొంది. సమయానుకూలంగా ఆ పరిధిని పెంచుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
హైడ్రా పరిధిని మరో 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించాలని కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. చెరువులను పరిరక్షణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించడంతో, హైడ్రాను మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో చర్చించినట్లు సమాచారం.
జీవో 111లోని ప్రాంతాలను హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావన : ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపు ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమిత కట్టడాలనే హైడ్రా కూల్చి వేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కూడా ముఖ్యమని గుర్తించింది. ఇటీవల గండిపేటలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద ఆక్రమిత కట్టడాలను నేలమట్టం చేసింది. ఐతే జీవో 111లోని ప్రాంతాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జీవో 111 పరిధిలో 84 గ్రామాలుండగా గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను రద్దు చేశారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో, చాలా మంది రియల్టర్లు, అక్రమార్కులు యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు.
మొయినాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్‌ల పేరుతో కాలువలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాల వల్ల జంట జలాశయాల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందున్న పర్యావరణ నిపుణుల అభిప్రాయాలతో ఏకీభవించిన హైడ్రా, చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించింది. శంషాబాద్, ఘట్కేసర్, పటాన్ చెరువు అవతల వైపు కూడా పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు నామరూపాల్లేకుండా పోయాయి. ఓఆర్ఆర్ అవతల కూడా తమ బుల్డోజర్లను పంపించేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా పరిధి విస్తరణపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Government Decision to Strengthen HYDRA : బుద్దభవన్‌లోని కార్యాలయంలోనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చెరువుల ఆక్రమణలపై పెద్దసంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన హైడ్రా, ఆ పోలీస్ స్టేషన్‌ను బుద్దభవన్‌లోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యుటేషన్‌పై 259 మంది పోలీసు సిబ్బందిని కోరగా, ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు కూల్చివేతలకు సంబంధించి ఆక్రమదారులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో హైడ్రా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. అలాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా అంతర్గతంగా విజిలెన్స్ విచారణ కొనసాగిస్తోంది. బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయాలనికి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వరుస కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.
మొదట పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు హైడ్రా కఠిన చర్యలతో వందల్లో పెరుగుతున్నాయి. వాటన్నింటిని స్వీకరిస్తున్న సిబ్బంది, అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో వాటిపై దృష్టి పెడుతున్న రంగనాథ్, అన్ని కోణాల్లో పరిశీలించాకే రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు.
హైడ్రాకు జై' కొడుతున్న జనం - మాకూ కావాలంటున్న జిల్లాలు - WE WANT HYDRA IN OUR DISTRICTS