Telangana Police Caught AP Constables for Supplying Ganja: హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్ పట్నాయక్, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు, సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లి పారిశ్రామిక వాడకు గంజాయిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటాక బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు ఓ వాహనంలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లుగా పక్కా సమాచారంతో ఏపీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్ పట్నాయక్, శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నంలో 12 వేల రూపాయలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, బాచుపల్లిలో 15 వేలకు చొప్పున అమ్మకం చేసేందుకు తీసుకువచ్చినట్లుగా తెలిసింది. వీరిద్దరూ కాకినాడలోని మూడో బెటాలియన్లు పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Chandrababu Tweet on AP Police Ganja Smuggling: గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కంటే డ్రగ్స్‌లో ప్రాచుర్యం పొందటం దురదృష్టకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల నిరోధక చర్యలో కాకినాడకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనపై తలెత్తే అన్ని అనుమానాలను పరిష్కరించాలని సూచించారు. దీని వెనుక సూత్రధారి ఎవరు, పాల్గొన్న నాయకులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh Tweet: ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు కావడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. క్రిమినల్-ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గజదొంగ జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొంతమంది పోలీసులూ దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్ ఖాకీలను ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యాలుగా వాడటంతో వారికీ నేరాలు అలవాటైపోయాయని ఆరోపించారు.
గంజాయి గుప్పుమంటున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు: లోకేశ్
సీఐడీని కిడ్నాప్‌లు, బెదిరింపులకి పాలకులు వినియోగిస్తున్నారని అన్నారు. దీంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని పోలీసులు ముఠాలుగా ఏర్పడి స్మగ్లింగ్, కిడ్నాపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా పోలీస్ వ్యవస్థ గౌరవం మంటగలుస్తోందన్నారు.
గంజాయి మాఫియాకి ఏపీ సర్కారు పెద్దల అండదండలున్నాయని, అందుకే పోలీసులు గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారని విమర్శించారు. 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంపై ఏపీలో పోలీసుల దుస్థితిని వెల్లడిస్తోందని అన్నారు.