Telangana Ministers Inspected Works of Sitarama Project : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల్లో మళ్లీ వేగం పుంజుకోనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు మళ్లించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఆ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో మొత్తం నాలుగు చోట్ల పంప్ హౌస్‌లు నిర్మించగా 16 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు.
భద్రాద్రి జిల్లాలో ఒకటి నుంచి 8 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీలో 114 కిలోమీటర్లు ప్రధాన కాల్వపొడవు ఉండగా దాదాపు పూర్తి కావొచ్చింది. సత్తుపల్లి ట్రంకును 9 నుంచి 12 ప్యాకేజీలుగా విభజించారు. కాల్వ పొడవు 116 కిలోమీటర్లుగా ఉంది. యాతాకుల కుంట టన్నెల్, గండుగులపల్లి వద్ద నాలుగో పంపుహౌస్ పనులు సాగుతున్నాయి. 13 నుంచి 16 వ ప్యాకేజీ వరకు పాలేరు ట్రంకుగా పనులు చేపట్టారు.
గంటల పాటు 63 కిలోమీటర్ల మేర పర్యవేక్షణ : 79 కిలోమీటర్ల పొడవు కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇక్కడి నుంచే ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబాబాద్ జిల్లాకు సాగునీరు అందించాల్సి ఉంది. దాదాపు ఏడేళ్లుగా అనేక అవాంతరాలు, అడ్డంకులతో నెమ్మదించిన సీతారామ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల, నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. మొత్తం 6 గంటల పాటు 63 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు కాల్వలపై తిరుగుతూ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
మూడు పంప్‌హౌజ్‌లను పరిశీలించిన మంత్రులు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులు, అక్కడే వ్యూపాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్-1 వద్దకు చేరుకొని పంప్ హౌస్ పనులను పరిశీలించిన తర్వాత విద్యుత్ సరఫరా ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌస్-3 వద్ద ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
పరిహారం తేల్చకుండా సీతారామ ప్రాజెక్టు పనులు - ఆందోళనలో భూనిర్వాసితులు - sitarama projects Works
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. కేవలం రూ.2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టు పేరుతో రీ డిజైన్ చేసి రూ.20 వేల కోట్లకు పెంచిన ఘనత గత బీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రులు విమర్శించారు.
"సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభించింది. దానికి రాజీవ్ గాంధీ అని నామకరణం చేస్తున్నాం. వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు 15లోపు పనులు పూర్తయ్యేలా చేస్తాం." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
నష్టమైనా, కష్టమైనా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు గోదావరి జలాలు అందిస్తామన్న మంత్రులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సరిదిద్దుతామని స్పష్టం చేశారు. కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల రైతుల ఆయకట్టు పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి జలాలతో పంటల సాగు చేద్దామని కొండంత ఆశతో ఉన్న అన్నదాతకు ఇప్పటి వరకు ఎదురుచూపులే మిగలగా సీతారామ ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం వేగం పెంచడంతో కర్షకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రూ.100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ కాలువ అనుసంధానం పనులకు శంకుస్థాపన
సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి తుమ్మల