Telangana HC sets Life Sentence to Husband who killed wife : మరణ వాంగ్మూలం ఇస్తున్నప్పుడు మానసిక పరిస్థితి బాగుంటే దాని ఆధారంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చని హైకోర్టు పేర్కొంది. భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనంటూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన యావజ్జీవ శిక్షను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పెద్దింటి భాస్కర్ అప్పిలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరమల్ల జితేందర్‌రావు వాదనలు వినిపిస్తూ 2015 ఏప్రిల్ 25న భాస్కర్‌కు వివాహం జరిగిందని కోర్టుకు వివరించారు. జులై 15న పీడకలలు వస్తున్నాయని తల్లి దగ్గరకు వెళ్తానని అతని భార్య అడగగా దుర్భాషలాడుతూ ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించాడని తెలిపారు. బాధితురాలి కేకలు విని తల్లి, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని చెప్పారు. చనిపోయే ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కింది కోర్టు భాస్కర్‌కు యావజ్జీవ శిక్ష విధించిందని తెలిపారు.
భార్య మంటల్లో ఉండగా భర్త నిద్రపోతున్నాడన్న వాదన అసమంజసం : భార్య మంటల్లో కాలుతున్న సమయంలో భర్త భాస్కర్ అదే గదిలో ఉన్నాడని, తలుపులు పగులగొట్టి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ భాస్కర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మృతురాలి తల్లి నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదని, పథకం ప్రకారం హత్య చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు, ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం, మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునే ముందు బాధితురాలి మానసిక స్థితి బాగానే ఉందని వైద్యులు ధ్రవీకరించినట్టు పేర్కొంది. భర్త భాస్కర్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చి కేసులో ఇరికించారనడానికి కారణం కనిపించలేదంది. భార్య మంటల్లో ఉండగా భర్త నిద్రపోతున్నాడన్న వాదన అసమంజసంగా ఉందని పేర్కొంది. మరణ వాంగ్మూలంతో పాటు పరిస్థితులు పరిశీలించిన మీదట భర్త భాస్కర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని తీర్పు వెలువరించింది.