Telangana High Court Serious on Stray Dogs Issue : హైదరాబాద్‌లో ఏ కాలనీలో చూసినా వీధికుక్కలు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. వాటిపై నియంత్రణ లేకపోవడంతో స్వైరవిహారం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ చేయకపోవడం సరైన ఆహారం లేకపోవడంతో మనుషులపై దాడులకు దిగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 19న బాగ్‌అంబర్‌పేట్‌లో కుక్కలు దాడిలో ఓ చిన్నారి మృతిచెందింది. గతనెల సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో బీహార్‌కు చెందిన ఆరేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.
మీడియాలో వచ్చిన ఆ కథనాల ఆధారంగా హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈనెల 2న జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కుక్కకాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్‌లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
కుక్కలు బాబోయ్ కుక్కలు - 10 ఏళ్లలో 3 లక్షల మందిని కరిచాయ్! - DOG BITE CASES IN HYDERABAD
కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాలతో కౌంటర్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్‌లో 350, బంజారాహిల్స్‌లో 250 కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు పేర్కొంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన కాలనీల్లో సంఘటనలు జరగడం లేదని, పేదలు నివసిస్తున్న మురికివాడలపై దృష్టి సారించాలని సూచించింది. ఈ వ్యవహారాన్ని ఒక కేసుగా చూడకుండా మానవీయ కోణంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపింది.
కొత్త నిబంధనలు రూపొందించామని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. నిబంధనలు ఎప్పుడూ ఉంటాయని గణాంకాలు కాదు, చిన్నారులు చనిపోకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. గతంలో ఎక్కడ దాడులు చేశాయి తరచూ అలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయనేది పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. కుక్కల దాడిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్న న్యాయస్థానం, ఉదాసీనత సహించబోమని, నిరక్ష్యం వహించే ఏఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. వారంలో కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.