Telangana High Court On Hydra Demolition : జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని అదనపు అడ్వకేట్ జనరల్‌ను (ఏఏజీ) ధర్మాసనం సూచించింది. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది, ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు ఎక్కువ అయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందని వివరించిన ఆయన స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
60 గజాలైన, 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలి : ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, కొట్టివేయాలన్న ఏఏజీ అభ్యర్థించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించారా అని ప్రశ్నించిన హైకోర్టు, 60 గజాలైన, 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలని నిర్దేశించింది. జన్వాడలోని ఫామ్‌హౌజ్ విషయంలో నిబంధనలను పాటించాలని హైకోర్టు పేర్కొంది.
ఫామ్‌హౌజ్ సంబంధించి అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్‌టీఎల్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నోటిఫై చేశారా అని హైకోర్టు అడిగింది. చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని హైకోర్టు వెల్లడించింది. ఎఫ్‌టీఎల్ పరిధులను ప్రాథమికంగా నోటిఫై చేశారని ఏఏజీ తెలిపారు.
అసలు ఏంటీ ఈ కేసు : జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. జన్వాడ ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్లో వివరించారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా స్టేట్ గవర్నమెంట్, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్పల్లి రెవెన్యూ ఆఫీసర్, చీఫ్ ఇంజినీర్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఆక్రమణలపై హైడ్రా హై నజర్ - కబ్జా అని తేలితే కూల్చేయటమే! - HYDRA OPERATIONS