Telangana High Court On Ganesh Idol Impression : హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వివాదంపై ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి, కోర్టుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం సరికాదంది. ఇప్పటికే ఇందులో ఉత్తర్వులున్నాయని, వాటిని పరిశీలిస్తామంటూ విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో పిటిషన్ : హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ, కోర్టు ధిక్కరణ కింద దీన్ని పరిగణించాలంటూ న్యాయవాది మామిడి మాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. నెంబరు కేటాయింపులో రిజిస్ట్రీ అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ వాయిదా : పిటిషనర్ వాదనలు వినిపిస్తూ హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు కథనాలు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిషేధంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏడాదిగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. చివరి క్షణంలో కోర్టుకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా అని నిలదీసింది. అయినా ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమేనని, దీనిపై తామే విచారణ చేపడతామంటూ ఈ నెల 9కి విచారణను వాయిదా వేసింది.
వినాయక నిమజ్జన ఘాట్లను పరిశీలించిన హైదరాబాద్ మేయర్ : హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్ గూడ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్‌గా పిలువబడే సఫిల్ గూడ చెరువులో సుమారు మూడు నుంచి నాలుగు వేల వినాయక విగ్రహాలు ప్రతీ ఏటా నిమజ్జనం జరుగుతుంటాయని అధికారులు తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఘాట్లను పరిశీలించినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వినాయక చవితి ఎప్పుడు? సెప్టెంబర్ 6నా లేదా 7నా? పండితుల సమాధానమిదే! - Is Ganesh Chaturthi Exact Date
భాద్రపద మాసం స్పెషల్ - వినాయక చవితితో పాటు ముఖ్యమైన పండగలివే! - Bhadrapada Masam 2024