Telangana HC on HYDRA : అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న వేళ, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులిచ్చి కనీసం ఒక్కరోజైనా ఆగకుండా కూల్చివేతలపై ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ హైడ్రాను నిలదీసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట పంచాయతీ పరిధిలోని మహ్మద్ రఫీ, గణేశ్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన ఆసుపత్రి భవనం కూల్చివేతలను హైకోర్టు తప్పుబట్టింది. సెప్టెంబరు 5న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లోనైనా వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈలోపు అమీన్‌పూర్ మున్సిపాలిటీ వివరణ సమర్పించాలని, దాని తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
అమీన్‌పూర్ కూల్చివేతలపై హైకోర్టు విచారణ : అమీన్‌పూర్‌లోని సర్వే నెంబర్ 164 ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను 18 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. అమీన్‌పూర్‌కు చెందిన గణేశ్ కన్‌స్ట్రక్షన్స్, డాక్టర్ మహ్మద్ రఫీ ఆ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 20న జారీ చేసిన నోటీసులను 21న సాయంత్రం 6.30 గంటలకు జారీ చేసి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సిబ్బందితో వచ్చి ఐదంస్తుల ఆసుపత్రి భవనాన్ని హైడ్రా కూల్చివేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది నరేందర్ వాదించారు. సర్వే నెంబరు 165, 166లో మహ్మద్ రఫీకి చెందిన 210 గజాల స్థలాన్ని గణేశ్ కన్‌స్ట్రక్షన్స్‌కు విక్రయించారన్నారు.
ఇందులో 2022 నవంబర్ 10న పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని, నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో హైడ్రా తరపు న్యాయవాది తన వాదనల్లో ఆసుపత్రి ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడూ సందర్శించలేదని, కూల్చివేయాలని అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నట్లు వివరించారు. ఏవైనా చర్యలు చేపడితే జీవో-99 ప్రకారం ఉంటాయని న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 5న పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసి వేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు.
హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు : హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు యంత్రాలు, సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్ రాసిన లేఖ ఈ నెల 21న అందిందని తెలిపారు. జీవో నెం 99, తహసీల్దార్ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ నిమిత్తం యంత్రాలు, సిబ్బందిని పంపినట్లు రవీందర్ రెడ్డి వివరించారు.
ఈ నెల 30కి వాయిదా : ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబరు 5న జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్, హైడ్రా కమిషనర్ కూల్చివేతలు చేపట్టారని పేర్కొంది. పిటిషన్లపై విచారణ ముగిసే దాకా కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదనే గతంలోని ఉత్తర్వులతో పాటు జీవో నెం 99 ప్రకారం చట్ట నిబంధనలు అనుసరించాలన్న ఆదేశాలను ఉల్లంఘించారని న్యాయమూర్తి వెల్లడించారు. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.
అమీన్‌పూర్‌లోని చెరువులు, పార్కుల్లో హైడ్రా సర్వే- కబ్జాదారుల్లో మొదలైన కలవరం
అమీన్‌పూర్ చెరువుపై హైడ్రా ఫోకస్ - నవ్య చౌరస్తాలో భవనం కూల్చివేత - HYDRA DEMOLITIONS IN SANGAREDDY