TG HC dismisses Petition against panchayat Merge : హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న గ్రామాలను పురపాలికల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. సమీపంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. గ్రామ పంచాయతీలను పురపాలికల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విలీనం జరిగిందని చెప్పింది. పాలనలో భాగంగా చట్టాలు తెచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామపంచాయతీలను ఇటీవల పురపాలికల్లో విలీనం చేశారు.
పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలు కాగా ఇవాళ సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఓఆర్ఆర్ పరిధి లోపల, ఓఆర్ఆర్ను అనుకొని ఉన్న 51 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర సర్కారు శరవేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుండటంతో పాలనా సౌలభ్యం కోసం ఆ నిర్ణయం తీసుకుంది. సర్పంచులు, పాలకవర్గం పదవి కాలం ముగియడం, ప్రత్యేక అధికారుల పాలనలో ఉండగానే 2019 పురపాలక చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
ఓఆర్ఆర్ పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా : రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ, ఘంసీమిగూడ విలీనం కాగా నార్సింగి పురపాలికలో మీర్జాగూడ గ్రామపంచాయతీ విలీనమైంది.
తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడను విలీనం చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయిలాపూర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి, నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార పంచాయతీలు పోచారం పురపాలికలో వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివాని సింగారం, చౌదరిగూడను విలీనం చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడల విలీనం చేశారు.
నిధులు సమకూర్చనున్న పురపాలికలు : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలను విలీనం చేశారు. తూంకుంట మున్సిపాలిటీలో బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు కలిసిపోయాయి. సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ పరిధిలోని తెల్లాపూర్ పురపాలికలో కర్దానూర్, ముత్తంగి, పోచారం, పాటీ, ఘన్‌పూర్ పంచాయతీలను కలిపారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఐలాపూర్, ఐలాపూర్ తండా, పటేల్ గూడ, దాయర, కిష్టారెడ్డిపేట, సుల్తాన్ పూర్ పంచాయతీలను విలీనం చేశారు. ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న గ్రామాలన్నీ మున్సిపాలిటీల్లో కలవడంతో అవన్ని పట్టణ ప్రాంతాలుగా పరిగణించబడతాయి. వాటికి కావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనను ఆయా పురపాలికలు సమకూర్చనున్నాయి.
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం - Gram Panchayats Merge