Telangana High Court Dismissed KCR Petition : ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, నేడు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ తేల్చి చెప్పింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి ఛైర్మన్‌గా విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి 15 మందిని విచారించి మాజీ సీఎం కేసీఆర్‌కు ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందున జూన్ చివరి వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరగా, గత నెలలో జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో వెల్లడించిన వివరాలను ఖండిస్తూ కేసీఆర్, జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్‌కు కమిషన్ గత నెల 19న మరోసారి లేఖ రాయడంతో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది హైకోర్టులోవాదనలు వినిపిస్తూ విద్యుత్ కమిషన్ విచారణ తీరును తప్పుబట్టారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేయడంలో తప్పేముందని, విచారణ చేపట్టి నివేదికను అసెంబ్లీలో ఇస్తే శాసనసభ్యులు చర్చిస్తారు కదా అని కేసీఆర్ తరఫు న్యాయవాదిని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆదిత్య సోంది కోర్టుకు తెలిపారు. విద్యుత్ కమిషన్‌కు ఉన్న అధికారాల మేరకు విచారణ నిర్వహిస్తోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగిన విధంగానే ప్రభుత్వం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిందని అడ్వకేట్ జనరల్ వాదించారు.
దీనిపై ఇరువైపుల ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది. మీడియా సమావేశం పెట్టారని పక్షపాత ధోరణితో వ్యవహించారంటుంటూ అనుమానించడం సరికాదని, తగిన ఆధారాలు చూపించాలని తెలిపింది. జస్టిస్ నరసింహారెడ్డిపై ఆరోపణల నిరూపణలో కేసీఆర్ విఫలమయ్యారన్న ఉన్నత న్యాయస్థానం, కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో కమిషన్ ఛైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్‌ప్లాంట్ల గురించి తెలుసుకోవడానికే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది.
అన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చామని హైకోర్టు తెలిపింది. పిటిషన్‌ను విచారణార్హత లేదన్న అడ్వకేట్ జనరల్ వాదనను పరిగణనలోకి తీసుకున్న సీజే ధర్మాసనం, ఈ మేరకు తీర్పు వెలువరించంది. కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో విద్యుత్ కమిషన్ విచారణ యథావిధిగా కొనసాగనుంది.