High Court Green Signal To Ganesh Immersion at Hussain Sagar : హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలపై రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లో విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది.
గత రెండేళ్లలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పిటిషనర్ మామిడి వేణమాధవ్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం నిమజ్జనాలు జరగట్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్‌పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని, వీటి వల్ల ట్యాంక్ బండ్‌కు ముప్పు ఉందని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, 2021లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే నిమజ్జనాలు జరపాలని తేల్చి చెప్పింది.
పీవోపీ విగ్రహాలను సహజ జలవనరుల్లో నిమజ్జనం చేయొద్దు : వాదనలకు తగిన ఆధారాలను చూపించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. గత రెండేళ్లలో మార్గనిర్దేశకాలను ఉల్లంఘించినట్లు భావిస్తే ఇంత ఆలస్యంగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి 2021లోనే మార్గనిర్దేశకాలున్నాయని, 2022లో జరిగిన విచారణ సందర్భంగా నిమజ్జనంపై పిటిషనర్‌తో పాటు హైకోర్టు సైతం సంతృప్తి వ్యక్తం చేసిందని ధర్మాసనం తెలిపింది. హుస్సేన్‌సాగర్‌లో కేవలం మట్టి గణపతులు, పర్యావరణహిత విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని మార్గనిర్దేశకాలున్నాయని పేర్కొంది.
పీవోపీ విగ్రహాలను సహజ జలవనరుల్లో నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. ట్యాంక్‌బండ్ మీద నుంచి కాకుండా ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, సంజీవయ్య పార్కుల పరిసరాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపింది. ఇప్పుడు జరిగే నిమజ్జనంలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నారని భావిస్తే ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ఈ మేరకు వేణుమాదవ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
ఈ బొజ్జగణపయ్యలు కాస్త డిఫరెంట్ - మీరూ చూసేయండి - Variety Ganesh Idols In Warangal