Telangana High Court on Phone Tapping Case : గత బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను పరిశీలించిన హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టీ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పనిచేసిన ఏఏస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే ప్రతి రాజకీయ నాయకులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి.
Phone Tapping Case Update : ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు సూచనలతో మేకల తిరుపతన్న, డి.ప్రణీత్అవు, టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ జీ రాధాకిషన్‌లు, ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఉగ్రవాదుల ఆచూకీ నిమిత్తం వినియోగించే పరికరాల సాయంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతోపాటు న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితాల గురించి వివరాలు సేకరిస్తారని భుజంగరావు వెల్లడించినట్లు పేర్కొన్నాయి.
వీరితోపాటు విద్యార్థినేతలు, ప్రతిపక్ష నేతల కుటుంబాలు, జర్నలిస్టులపై నిఘా ఉంటుందని పేర్కొన్నాయి. దుబ్బాక, హుజూర్నగర్, మునుగోడు ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దీన్ని ఉపయోగించినట్లు గులాబీ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి తామంతా కృషి చేసినట్లు భుజంగరావు పేర్కొన్నారని, బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ప్రముఖ కంపెనీలు, వ్యక్తులకు చెందిన సివిల్ వివాదాలను సెటిల్ చేసినట్లు కథనాలు వచ్చాయి.
రేపు మధ్యాహ్నం విచారించనున్న సీజే ధర్మాసనం : ఎన్నికల ప్రచారం సమయంలో పలు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు నేతల డబ్బులను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నట్లు భుజంగరావు చెప్పినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. భుజంగారావు, ప్రణీత్‌రావు, తిరుపతన్న వాంగ్మూలాల ఆధారంగా పలు కథనాలు వచ్చాయి. పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలించిన హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది.